తెలుగు ప్రపంచ మహాసభలకి స్వాగతం
హైదరాబాద్ Dec 15 – 19, 2017
తెలుగు భాషా వికాసాలకు పుట్టినిల్లు తెలంగాణ. తెలంగాణ అంటే తెలుగు ప్రజలు నివసించే ప్రదేశం అని అర్థం. రెండున్నరవేల వసంతాల తెలుగు వెన్నల సోన మన తెలంగాణ. అలనాటి హాలుని గాథా సప్తశతిలో అల్లనల్లన అల్లుకున్న తెలుగు పదదీప్తి కాలగమనంలో దశ దిశల ప్రసరించింది. ఈ పదరూపాలు చారిత్రిక జీవనాన్ని అక్షరబద్ధం చేసిన శాసనాలైనాయి. అందమైన అలంకారాలు ధరించి హృద్యమైన పద్య కావ్యాలైనాయి. తెలంగాణ అన్ని సాహిత్య ప్రక్రియలకు ఆదిగా నిలిచింది. తొలి అలంకార గ్రంథాన్ని సంతరించింది. ఎలుగెత్తి పాడుకునే ద్విపదనందించింది.
తెలుగు స్వతంత్ర కావ్యం, శతకం, ద్విపద రామాయణం, అచ్చ తెలుగు కావ్యం, యక్ష గానం, సాంఘిక చరిత్రం అన్నిటికీ తొలిరూపు దిద్దింది. ఆధునిక ప్రక్రియలైన వచనకవిత, కథ, నవల అన్నిటిలో తనదైన జీవనాన్ని చిత్రించింది. కొలమానాలకందని సాహిత్య సంపదతో కొలువుదీరింది. తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది.
అడ్డాలనాడు బిడ్డలే గాని గడ్డాలనాడు కాదని మాతృభాషలన్నీ మౌనంగా రోదిస్తున్న రోజులివి. ‘తోటలో వదంతి పుట్టింది పూలన్నీ వాడిపోయాయని… పూలు అదృశ్యమయ్యాయిరా ఫలాలై తిరిగి రావడానికి’ అన్న సినారె ఆశే శ్వాసగా సాగుతున్న భాషాభిమానుల ఆర్తికి ప్రపంచ తెలుగు మహాసభలు చలువ పందిళ్లు వేస్తున్నాయి. ఆంగ్లభాషతో కొంగుముడి వేసుకొని కొండెక్కి కూర్చున్న తెలుగు బిడ్డల్ని ‘చందమామ రావే – జాబిల్లి రావే’ అంటూ ఆప్తగీతం ఆహ్వానిస్తోంది. తెలుగింటి సాహితీ వంటశాలలో నలభీమ పాకాలను మించి చవులూరించే, జ్ఞప్తికొస్తే చాలు మళ్ళీ రుచి చూడాలనిపించే- కావ్యాల నుంచి కవితల దాకా, జ్ఞానపథం నుంచి జానపదం దాకా, పంచరత్నాల నుంచి యక్షగానాల దాకా వైవిధ్య ప్రక్రియలు ఎన్నని! శతాబ్దాల ఆ ఘుమఘుమల నుంచి కొన్ని మేలిమి ‘పదా’ర్థాలను రుచి చూద్దాం, రండి!
మమకారపు నుడికారం
‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’ అన్నారు బాలగంగాధర తిలక్. అవును… అక్షరాలు చాలా అందమైనవి! ఎంత అందమైనవి కాకుంటే మహాకవి శ్రీశ్రీ ‘…అందని అందానివిగా, నీకై బతుకే ఒక తపమై…’ అని జీవితకాలం నిరీక్షిస్తాడు… నిరంతరం ఆరాధిస్తాడు… నిత్యం ఉపాసిస్తాడు!
‘నేనంతా పిడికెడు మట్టే కావచ్చు కానీ కలం ఎత్తితే- ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది…’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. అవును… అక్షరాలకు పొగరుంటుంది! పొగరే లేకుంటే ‘ఏనుగునెక్కినాము ధరణీశులుమొక్కగ నిక్కినాము’ అనడం తిరుపతి వేంకటకవులకు ఎలా చెల్లుబాటు అవుతుంది? పొగరే లేకుంటే, పిల్లలమర్రి పినవీరభద్రుడు ‘వాణి నారాణి!’ అనగలిగేవాడా? విశ్వనాథ ‘అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయ మూర్తి’ అయ్యేవారా?
ఖలీల్ జిబ్రాన్ ‘ది ప్రొఫెట్’ (ప్రవక్త)ను ‘జీవనగీతి’గా అనువదిస్తూ- ‘అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క- లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ. అదీ అక్షరం సత్తా! అక్షరం అన్నం పెడుతుంది… అమ్మలా వెన్ను తడుతుంది. కొండంత ధైర్యాన్నిస్తుంది. దుఃఖంలో ఓదారుస్తుంది. మనుగడలో దారి చూపిస్తుంది. వెలుగుల్లోకి నడిపిస్తుంది.
‘అక్షరమ్ము వలయు కుక్షి జీవులకు అక్షరమ్ము జిహ్వకు ఇక్షురసము అక్షరమ్ము తన్ను రక్షించుగావున అక్షరమ్ము లోక రక్షితమ్ము’ అన్నమాట అక్షరసత్యం! ‘శ్రీవాణీ గిరిజాః’ అంటూ ఆదికవి నన్నయభట్టు ఏ శుభవేళ కావ్య రచనకు శ్రీకారం చుట్టాడోగాని, ఆనాటినుంచీ మన అక్షరాలు ‘శ్రీ’ అనే అక్షరంలోని ఇంపుసొంపులనూ ఆ ఒంపులనూ ఒయ్యారాన్నీ సోయగాన్నీ తమలో పొదువుకున్నాయి. శ్రీ అంటే సంపద, విద్య, శక్తి. లక్ష్మి, సరస్వతి, పార్వతులకు అది సంకేతం. అక్షరంతో ఆ మూడూ సిద్ధించడం అందుకే. ఆ మూడింటా అక్షరం గొప్ప దన్నుగా నిలుస్తుంది