హైకోర్టుల విభజన జరిగిన సందర్భంగా న్యాయమూర్తుల నియామకం జరిగింది. జనవరి 1 నుంచి ఏపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్‌ను తెలంగాణ సిజేఏగా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు జస్టిస్ ఆర్‌ఎస్ చౌహన్, జస్టిస్ రామ సుబ్రమణియన్‌ను తెలంగాణకు కేటాయిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. ఉమ్మడి హైకోర్టులో ప్రస్తుతం మొత్తం 27 మంది న్యాయమూర్తులు సేవలందిస్తుండగా 14 మందిని ఏపికి, 10 మందిని తెలంగాణకు కేటాయించారు. ఏపికి కేటాయించిన వారిలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. తాజా ఉత్తర్వులతో ఏపిలో 14 మంది, తెలంగాణలో 13 మంది న్యాయమూర్తులు సేవలందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనవరి 1 నుంచి అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారం భించాలని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో లాంఛనాలన్నీ శరవేగంగా పూర్తవు తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నియ మితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. జనవరి 1న హైకోర్టుకు సెలవు దినం కావడంతో 2వ తేదీన ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఏపీకి కేటాయించిన 14 మంది న్యాయమూర్తుల్లో జస్టిస్ ప్రవీణ్‌కుమారే సీనియర్. దీంతో రాష్ట్రపతి ఆయనవైపు మొగ్గు చూపారు. అత్యంత సౌమ్యుడిగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌కు పేరుంది.