వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను’’ అంటూ తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారాయన. ప్రస్తుతానికి వైఎస్ జగన్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జననేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటాన్ని చూడాలనే కోరికతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకునే ముందు వైఎస్ జగన్ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.