వరల్డ్ నో టొబాకో డే 2025 – ఆరోగ్య అవగాహన సదస్సు
బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ మరియు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సెమినార్
పొగాకు వ్యసనం నుండి యువతను, సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు.
‘వరల్డ్ నో టొబాకో డే 2025’ సందర్భంగా బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ మరియు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో జాతీయ స్థాయి ఆరోగ్య అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ముఖ్య అతిథిగా, డాక్టర్ వినయ్ సరికొండ విశిష్ట అతిథిగా, పలువురు ప్రముఖ వైద్య నిపుణులు, సామాజిక వేత్తలు పాల్గొన్నారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించారు. “పొగాకు వాడకం వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుంది. నేరుగా పొగాకు వినియోగించే వారితో పాటు, వారి చుట్టూ ఉండే వారు కూడా సెకండ్‌హ్యాండ్ స్మోక్ ద్వారా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, న్యూమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి రుగ్మతలు సంభవిస్తాయి. ఇవి యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టివేస్తాయి. మనమంతా కలిసి ఈ వ్యసనానికి వ్యతిరేకంగా పోరాడాలి,” అని ఆయన పేర్కొన్నారు. “మనసు మారితే మార్గం సుగమం అనే సామెతను స్ఫూర్తిగా తీసుకొని ఈ సదస్సును నిర్వహించాము,” అని తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది పొగాకు వల్ల మరణిస్తున్నారు. వీరిలో 12 లక్షల మంది సెకండ్‌హ్యాండ్ స్మోక్ బాధితులు. భారతదేశంలో 27.5 కోట్ల మంది పొగాకు వినియోగదారులు ఉన్నారు, ఇది అత్యధికం. ఈ గణాంకాలు సమాజంలో అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు లక్ష్యంగా నిర్వహించబడింది.
పొగాకు పరిశ్రమ యువతను ఆకర్షించేందుకు ఉపయోగించే మోసపూరిత వ్యూహాలను బహిర్గతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాలపై సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ సదస్సు నిర్వహించబడింది. పొగాకు వ్యతిరేక ఉద్యమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ సరికొండ , ఇంటలెక్చువల్ ఫోరమ్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి ,తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ అడ్వైజర్ హేమంత్ బత్తుల, మేధావులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు