తెలంగాణలో సగానికన్నా ఎక్కువగా ఉన్న వెనకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ డిక్లరేషన్‌ను తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు రాబోయే తరాలకు మార్గదర్శకంగా, దేశానికే ఆదర్శంగా ఉండేలా విధానాలు అమలు చేస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు రెండు, మూడు రోజులపాటు సమగ్రంగా చర్చించి, సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలన్నారు. వాటిపై శాసనసభలో ఒక రోజు పూర్తిస్థాయిలో చర్చించి, నిర్ణయాల అమలుకు తీర్మానాలు, చట్టాలు, జీవోలు, నిబంధనలు తెస్తామని వెల్లడించారు. వాటి అమలు బాధ్యత తనదేనని, భవిష్యత్తులో వాటినెవరూ తొలగించలేనంత పకడ్బందీ విధానాలు తెస్తామని భరోసా ఇచ్చారు.
https://www.youtube.com/watch?v=IcVJsH4Aj4E
చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం తేవాలని కేంద్రాన్ని కోరతామని, ప్రధానిని కలిసి ఒత్తిడి తెస్తామని చెప్పారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, అధిక బడ్జెట్ కేటాయింపులను కోరతామన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఆదివారం శాసనసభలో ఆ వర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. బీసీల సమస్యలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు విన్న తర్వాత ఆయన మాట్లాడారు. ‘‘బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేద్దాం. బీసీలకే ఇంకా ఏం కావాలో కొత్త పథకాలు, కార్యక్రమాలు సూచించండి. అన్ని కుల సంఘాలతో మాట్లాడి, అందరి అభిప్రాయాలు తీసుకొని నివేదిక ఇవ్వాలి. అంశాలపై స్పష్టత వచ్చాక శాసనసభలో ఒక రోజు చర్చించి, విధానపరమైన నిర్ణయాలు తీసుకుందాం. కొన్ని కులాలకు ధ్రువీకరణపత్రాలు ఇచ్చే విషయంలో ఇబ్బందులున్నాయి. మరికొన్ని కులాలకు గుర్తింపు సమస్యలున్నాయి. ప్రభుత్వ లబ్ధిపైనా కొన్ని కులాల మధ్య ఘర్షణలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి అన్ని విషయాల్లో ఆచరణీయమైన మార్గాన్ని ప్రజాప్రతినిధులు సూచించాలి. సమున్నత లక్ష్యం కోసం సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఒకరి పెత్తనం కింద మరొకరు బతకాల్సిన అవసరమే లేదు. ఆత్మన్యూనతతో కాదు అందరూ ఆత్మవిశ్వాసంతో బతకాలి.
* పారిశ్రామిక స్థలాల కేటాయింపులో బీసీలకు రిజర్వేషన్లు
* ఎంబీసీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణసాయం
* రజకులు, నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి రూ.250 కోట్ల చొప్పున నిధులు