ప్రధాని మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
పార్లమెంట్‌లో ఈ బిల్లుకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేస్తాం
విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. సోమాజీగూడలో జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బీసీలకు దక్కాల్సిన హక్కులపై పలువురు బీసీ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్రం బీసీలను చిన్న చూపు చూస్తోందని, ఇలానే ప్రవర్తిస్తే బీసీల ధర్మాగ్రహం తప్పదని బీసీ నేతలు హెచ్చరించారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో రాజకీయ వైరం పనికి రాదని కేంద్రానికి దుండ్ర కుమారస్వామి హితవు పలికారు. బీసీల సంక్షేమంపై తమకు చిత్తశుద్ధి ఉందని బీజేపీ చెబుతోందని, అందుకు తగ్గట్టుగా నిరూపించుకోవాలని దుండ్ర కుమారస్వామి కోరారు.
దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే.. అసమానతలు లేని సమాజం నిర్మాణం జరగాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కోరారు. చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే అది సాధ్యమవుతుందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని కోరారు. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఆ పార్టీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారని దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్ట్‌కార్డుల ద్వారా లేఖలు రాయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో భాగంగా లక్ష పోస్టు కార్డులు ప్రధాని మోదీకి పంపాలని నిర్ణయించినట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ పోస్ట్‌కార్డ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, తన స్వహస్తాలతో రాసిన పోస్ట్‌కార్డును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు. ఈ పోస్ట్‌కార్డ్ ఉద్యమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన బీసీ నాయకులు, మేధావులు, ప్రజా సంఘ నాయకులు, బీసీ బిల్లుకు మద్దతుదారులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భాగస్వాములు కావాలని దుండ్ర కుమారస్వామి కోరారు.