తెలంగాణలో ఓటరుగా నమోదు మరో ఆరు రోజులు మాత్రమే గడువు
ఓటరుగా నమోదు చేసుకునేందుకుగాను ఇదే చివరి అవకాశమని, మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 25వ తేదీ వరకే గడువుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ www.ceotelangana.nic.in, NVSP.inవెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. అంతేకాకుండా పేరు, అడ్రస్ తదితర తప్పులేమైనా ఉంటే సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి తప్పులను సరి చేయించుకోగలరన్నారు. ప్రతి ఒక్క మహిళగా నమోదు చేయించేందుకు మహిళా సమాఖ్య సభ్యులు అన్ని గ్రామాల్లో ప్రచారం చేయించనున్నామని, అర్హులైన మహిళలను ఓటరుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 22న ఓటరుగా నమోదు కాని దివ్యాంగులను ఓటరుగా చేసేందుకు ప్రత్యేక డ్రైవ్, యువతీ యువకులను ఓటరుగా నమోదు చేయించేందుకు 24న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఓటరు నమోదు కోసం ప్రతి గ్రామ పంచాయతీల్లో బ్యానర్‌లను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా అర్హులైన ఓటర్లను ఎవరిని కూడా తొలిగించలేదని, బోగస్ ఓటర్లుగా గుర్తించామని, మరోసారి సంబంధిత సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించి రెండు రోజుల్లో బోగస్ ఓటర్లుగా తేలినట్లయితే ఓటరు జాబితా నుంచి తొలిగిస్తామని స్పష్టం చేశారు.