మాదాపూర్ (హైటెక్ సిటీ) లో ఐటిసి కోహినూర్ త్వరలో
ఆతిథ్య రంగానికి పేరుగాంచిన హైదరాబాద్‌లో మరో విలాసవంతమైన హోటల్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఐటిసి లిమిటెడ్ గ్రూప్‌నకు చెందిన ఐటిసి హోటల్స్.. మాదాపూర్ (హైటెక్ సిటీ)లో ఐటిసి కోహినూర్ పేరుతో ఈ హోటల్‌ను నిర్మించింది. వచ్చే జూన్ నుంచి ఈ హోటల్ సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం ఈ హోటల్‌లో గదుల కోసం రిజర్వేషన్లు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. హైటెక్ సిటీ దేశ విదేశీ ఐటి కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. దీనికి దగ్గర్లోనే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసిసి) కూడా ఉంది. ఇందులోనే అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. దేశ విదేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు తరచూ వస్తూపోతూ ఉంటారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో ట్రైడెంట్, లెమన్ ట్రీ, వెస్టిన్, ఆవాసా, నోవాటెల్ తదితర హోటళ్లు ఉన్నా యి. కానీ వీటికి భిన్నంగా అద్భుతమైన ఆకృతితో, ఆకర్షణీయంగా ఐటిసి కోహినూర్ రూపుదిద్దుకుంది. ఈ హోటల్‌లో 235 గదులు, ప్రత్యేకంగా రూపొందించిన 9 సూట్స్, 27 సర్వీస్ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. వీటితోపాటు గోల్కొండ పెవిలియన్, యి జింగ్, ఒట్టిమో, పీకాక్ బార్, రూఫ్‌టాప్ బార్ వంటి సిగ్నేచర్ రెస్టారెంట్స్ ఉన్నా యి. వీటితోపాటు విశాలమైన బాంక్విట్ హాల్, మీటింగ్ రూమ్స్, హైటెక్ బోర్డ్ రూమ్ వంటివి కూడా ఉన్నట్టు ఐటిసి హోటల్స్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ హోటల్ కోసం 700 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో మాత్రమే సర్వీస్డ్ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఇలాంటి అపార్ట్‌మెంట్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది.