ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిలా, ఉప్పల్ పట్టణ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్ కోసం వారి తల్లిదండ్రులు బుధవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా, కరోనా తగ్గిపోయింది, లాక్ డౌన్ అయిపోయింది అనేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, వచ్చిన వారు సరైన క్యూ పద్ధతిలో నిల్చునే ఏర్పాట్లు కూడా చేయకపోవడం వల్ల, నిన్న ప్రాథమిక కేంద్రంలో తీవ్రమైన తోపులాట జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా వైద్యాధికారులు మాత్రం నిమ్మకు నిరెత్తనట్లుగా ఉన్నారని, ఏమాత్రం చర్యలు తీసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అంత తోపులాట జరుగుతుంటే ఏ ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరని, ఆక్కడికి వచ్చిన పసిపిల్లల తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ కోసం వస్తే, ఈ గుంపులో నిలబడి కరోనా అంటించుకొని ఇంటికి పోవాల్సిన దుస్థితి వచ్చింది అంటూ భయాందోళనకు గురయ్యారు. ఈ హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్ కానీ, ఇందులో జోక్యం చేసుకొని, ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పసి పిల్లల తల్లులు డిమాండ్ చేశారు..