ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్లోని హెచ్ఎండీఏ లేఅవుట్లో ఓ వ్యక్తి మృత దేహం లభించడంతో అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టిన పోలీసులు.. సదరు వ్యక్తి హత్యకు గురైనట్లు ధృవీకరించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే…
నగరంలోని బాలానగర్, ఐడీపీఎల్ కాలనీకి చెందిన బాలరాజు (22) కిరాణా దుకాణంలో పని చేసేవాడు. చిలుకానగర్ కి చెందిన ఆటోడ్రైవర్ మహేష్తో బాలరాజుకు గత కొన్నేళ్లుగా పరిచయం ఉంది.
ఈనెల 20వ తేదీన మహేష్ తన స్నేహితులు నాగరాజు, సాయితో కలిసి సనత్నగర్, జింకల బావిలోని కల్లు దుకాణంలో కల్లు తాగుతుండగా బాలరాజు అక్కడికి వెళ్లాడు. వారందరు కలిసి కల్లు, మద్యం సేవించిన అనంతరం మహేష్ తన ఆటోలో బాలరాజును అతని ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఇంతలో మహేష్ కు తన ఫోన్ కనిపించకపోవడంతో తిరిగి వచ్చి బాలరాజును ఫోన్ గురించి ఆరా తీయగా అతను తనకేమి తెలియదని చెప్పడంతో.. బాలరాజును చిలుకానగర్ లోని తన నివాసానికి తీసుకొని వెళ్లి చేతులతో కొట్టాడు. దీంతో బాలరాజు తన కిరాణా దుకాణం యజమాని దేవేందరకు అతని ఫోన్ ను ఇచ్చినట్లు చెప్పగా.. సదరు దుకాణ యజమానిని సంప్రదించినప్పటికీ ఫోన్ లభించలేదు.
తరువాత అతని స్నేహితులు నాగరాజు, సాయి ఇంటికి వెళ్లిపోగా… రాత్రి సమయంలో మహేష్ తన సోదరులు నరేష్, సుధీర్తో కలిసి బాలరాజును శారీరకంగా హింసించారు. మద్యం మత్తులో ఉన్న బాలరాజు ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడే మృతిచెందాడు. వెంటనే మహేష్ తన భార్య విజయ, సోదరులు నరేష్, సుధీర్ తో కలిసి ఆటోలో వెళ్లి.. ఉప్పల్లోని హెచ్ఎండీఏ లేఅవుట్లో బాలరాజు మృతదేహాన్ని కిరోసిన్ పోసి నిప్పు అంటించారు.
అనంతరం తమ బంధువైన రవి నివాసానికి వెళ్లి ఆశ్రయం పొందారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు పాల్పడిన మహేష్, నరేష్, సుధీర్, విజయతో పాటు వారికి ఆశ్రయం కల్పించిన రవిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఒక ఆటో, ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లతోపాటు హత్యకు ఉపయో గించిన కిరోసిన్ డబ్బా, లైటర్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును రాచకొండ ఐటీ, మల్కాజిగిరి ఎస్వోటీ సహాయంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్, అదనపు సీపీ జి. సుధీర్ బాబు, డీసీపీ డి.శ్రీనివాస్, ఏసీపీ శ్యాం ప్రసాద్ రావు, ఉప్పల్ ఎన్హెచ్వో సీహెచ్ రంగ స్వామి, ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ జి. నవీన్ కుమార్ పర్యవేక్షణలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి, ఎస్ఎస్ఐలు అంజయ్య. జయరామ్, మైబెల్లి, ఏఎస్ఐ హను మా నాయక్, కానిస్టేబుళ్లు విజయ్ నవీన్, బాదుషా, మహిపాల్రెడ్డి, మహేష్. నాగరాజులు చేధించారు.