రాష్ట్ర డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావును హైదరాబాద్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
సోమవారం రాత్రికల్లా రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు పోలీసు అకాడమీలో ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ పరేడ్ జరగనుంది. అనంతరం 11.30 గంటలకు మహేందర్‌రెడ్డి ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి. అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా నియమిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేశారు.
తెలంగాణ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ శర్మ
రాష్ట్ర పోలీస్, శాంతిభద్రతలు, నేర నియంత్రణ ప్రభుత్వ సలహదారుడిగా రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అందిన అధికారిక ఉత్తర్వులను స్వీకరించి జాయినింగ్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అనురాగ్ శర్మ పంపించారు. సచివాలయంలో పూర్తి స్థాయిలో కార్యాలయం ఏర్పాటైన తర్వాత తన కార్యకలాపాలు సాగించనున్నట్టు ఆయన తెలిపారు.