కాబోయే అధ్యక్షుడు బైడెన్‌కు కంగ్రాట్స్ తెలిపిన అధ్యక్షుడు ట్రంప్. అమెరికా 46వ దేశాధ్యక్షుడిగా జోసెఫ్ బైడెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ తన చివరి సందేశం వినిపించారు. ఫేర్‌వెల్ వీడియో పోస్టు చేసిన ట్రంప్.. కాబోయే అధ్యక్షుడు బైడెన్‌కు కంగ్రాట్స్ తెలిపారు. అమెరికాను సురక్షితంగా, సస్యశ్యామలంగా ఉంచేందుకు బైడెన్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. అమెరికా ప్రజలు ఐక్య విలువలతో కలిసి ఉండాలని, ఎవరూ విద్వేషపూరితంగా వ్యవహరించరాదన్నారు. ట్రంప్ వీడియో సందేశాన్ని వైట్‌హౌజ్ రిలీజ్ చేసింది. అమెరికా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప వరంగా భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అసాధారణ రీతిలో తన ప్రయాణం సాగిందన్నారు. దేశ సేవ చేయడం గొప్ప అవకాశమని, గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఈ వారంలో కొత్త పరిపాలన ఆవిష్కృతం కానున్నదని, ఆ ప్రభుత్వం సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం అమెరికాను సురక్షితంగా ఉంచుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. బైడెన్ ప్రభుత్వానికి బెస్ట్ విషెస్ అందిస్తున్నామని, అదృష్టం కూడా కలిసి రావాలన్న అంశాన్ని ట్రంప్ వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్‌కు హాజరుకావడం లేదని ఇటీవల ట్రంప్ వెల్లడించారు. ఇటీవల జరిగిన క్యాపిటల్ హిల్ దాడి ఘటన గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. క్యాపిటల్ దాడితో అమెరికన్లు అందరూ హడలెత్తారని, రాజకీయ హింస దేశ ప్రజలపై దాడి వంటిదని, దాన్ని సహించబోమన్నారు. విద్వేషాలను పక్కనపెట్టి, కలిసికట్టుగా ఐక్య లక్ష్యాల వైపు ముందుకు సాగాలన్నారు.