మొత్తం 32 స్థానాలు క్లీన్‌స్వీప్ చేసింది టీఆర్ఎస్. రాష్ట్రంలోని అన్ని జడ్పీ సీట్లను అధికార పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులనూ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
కారు మళ్లీ టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. జడ్పీ పీఠాలపై గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణలో జిల్లా పరిషత్ ఛైర్మన్‌ల ఎన్నిక పూర్తయింది. శుక్రవారం ఎంపీపీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన టీఆర్ఎస్ అభ్యర్థులు జడ్పీ ఛైర్మన్ల ఎన్నికల్లోనూ సత్తాచాటారు. మొత్తం 32 స్థానాలు క్లీన్‌స్వీప్ చేసింది టీఆర్ఎస్. రాష్ట్రంలోని అన్ని జడ్పీ సీట్లను అధికార పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులనూ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. దాంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అన్ని జిల్లాల్లో విజయ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి.
ఈనెల 4న పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. 32 జిల్లాల్లోనూ జెడ్పీ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకునే రీతిలో టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 538 జెడ్పీటీసీలకు గానూ.. టీఆర్ఎస్ 449 స్థానాలను దక్కించుకుంది. కరీంనగర్, గద్వాల, మహబూబ్‌నగర్, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలో టీఆర్‌ఎస్ అన్ని జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, మేడ్చల్, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్కో జెడ్పీటీసీ స్థానంలో మాత్రమే గెలుపొందగా, మిగిలిన స్థానాలన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరాయి.