తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీకి వెళ్లాననే కోపంతో తనకు భర్త ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పట్టణానికి చెందిన ఓ ముస్లిమ్ మహిళ ఆరోపించిన ఘటన సంచలనం రేపింది. బరేలీ పట్టణానికి చెందిన ఫెరా అనే యువతిని దానిష్ అనే యువకుడు గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు ఓ కుమారుడున్నాడు.
ట్రిపుల్ తలాఖ్
ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసినందుకు కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ సోదరి ఫర్హాత్ నక్వీ నిర్వహించిన ధన్యవాద్ ర్యాలీలో ఫెరా పాల్గొంది. తాను మోదీ ర్యాలీలో పాల్గొని ఇంటికి వచ్చాక తన భర్త దానిష్ తనకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చి తన కుమారుడితోపాటు ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఫెరా ఆవేదనగా చెప్పింది. కాగా ప్రధాని మోదీ ర్యాలీకి వెళ్లినందుకు తాను భార్యకు విడాకులు ఇవ్వలేదని, తన భార్య ఎల్లప్పుడూ జీన్స్ దుస్తులు ధరిస్తూ అక్రమ సంబంధం పెట్టుకున్నందునే తాను ఆమెకు విడాకులు ఇచ్చానని భర్త దానిష్ అంటున్నారు.