ట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం లభించింది. కాంగ్రెస్, ఏఐఏడీఎంకే సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. మొత్తం 256 ఓట్లు నమోదయ్యాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు విభజన సృష్టిస్తోందని, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు వ్యతిరేకంగా ఉండటంతోపాటు వివక్షాపూరితంగా ఉందన్నారు. మహిళకు విడాకులిచ్చే పురుషుడిని నేరస్థుడని ఏ మత చట్టమూ చెప్పదన్నారు. ఈ బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ఆయన అభిప్రాయాలతో ఏఐఏడీఎంకే ఫ్లోర్ లీడర్ కూడా ఏకీభవించారు. బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీకి నివేదించేందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో కాంగ్రెస్, ఏఐఏడీఎంకే సభ నుంచి వాకౌట్ చేశాయి.
వెంట వెంటనే మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులివ్వడం నేరమని ఈ బిల్లు చెప్తోంది. ఈ నేరానికి పాల్పడినవారికి మూడేళ్ళ జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పించింది. ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులిచ్చిన భర్తపై భార్య ఫిర్యాదు చేస్తే, ఆ భార్యను సంప్రదించి, ఆ భర్తకు బెయిలు ఇచ్చే అధికారం మేజిస్ట్రేటుకు ఉందని తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీకి నివేదించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించారు. ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరమని ఈ బిల్లులో పేర్కొన్నందువల్లే ప్రతిపక్షాలు ఈ డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇతర నేరాలకు పాల్పడినవారికి కఠిన శిక్షలు విధిస్తూ పార్లమెంటు బిల్లులను ఆమోదించినపుడు, ఆ నేరస్థుల కుటుంబాలకు ఏం జరుగుతుందని ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.