బీసీలను ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులుగా నిలపాలని!
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తెలంగాణలో బీసీల అభివృద్ధి అద్భుతంగా జరుగుతోందని, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను తీసుకుని వచ్చారని.. ఇంకొన్ని తీసుకుని వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలను ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులుగా నిలపాలని దుండ్ర కుమారస్వామి కోరారు. రంగారెడ్డి జిల్లాలో బీసీల ఆత్మ సమ్మేళనం సభలు ఏర్పాటు చేయడం ఆనందించదగిన విషయమని అన్నారు. జాతీయ బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పలు బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల బలం చాలా ఉందని అన్నారు. ఎక్కువ జనాభా ఉన్న నియోజకవర్గాలలో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం ఉద్యమాలు చేయడానికి తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేస్తానని దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీల సమగ్ర అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.