తెలంగాణ : తెలంగాణలో బిసి కమిషన్ పాలకమండలిని త్వరలో నియమించాలని తెలంగాణ బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. చైర్మన్ మరియు సభ్యులు లెక దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా హైకోర్టు కూడా నియమించాలని ఉత్తర్వులు జారీ చేసినా, ఇప్పటివరకు దీనిని ఎటువంటి కార్యాచరణ చేయకపోవడం వలన బీసీల అభివృద్ధికి అడ్డుగోడ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత బంధు లాంటి కొత్త స్కీములు ప్రవేశపెడుతున్న తరుణంలో బీసీ లకు అమలులో ఉన్న బీసీ కమిషన్ పాలకమండలి నియమించకపోవడంతో ఈరోజు బీసీలు ఆందోళనకు గురి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ బీసీలకు పెద్దపీట వేసే విధంగా ఉండాలని, బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పథకాలు, కార్యాచరణ ఉండాలని కోరారు.
బీసీలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా బీసీ కమిషన్ ఉండేదని, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండి, ఒక ప్రతిష్ట మైన వేదికగా ఉండేదని, ఇప్పుడు కమిషన్ సభ్యులు మరియు ఛైర్మన్ లేకపోవడం వల్ల చాలా మందికి తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయానికి గురి అవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం త్వరలో బీసీ కమిషన్ పాలక మండలిని పూర్తిస్థాయిలో నియమించి, కమిషన్ ను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా, దుండ్ర కుమారస్వామి కోరారు.