రజకుల రక్షణకు, సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
అయ్యప్ప సొసైటీ రజక సంఘం అధ్యక్షుడు సుబ్బు ఆధ్వర్యంలో రజకుల సమస్యలపై నిర్వహించిన కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. రజక సంఘం నేతలతోనూ, సభ్యులతోనూ పలు విషయాలపై దుండ్ర కుమారస్వామి చర్చించారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ రజకులు ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారని.. ఎన్నో గ్రామాల్లో రజకులు బట్టలు పిండుకుంటూ ఇంకా వివక్షను ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ చూపి వారిని అభివృద్ధి పథంలో నడిచేలా చేయాలని కోరారు. రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలని, రజకుల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు జరగాలని కోరారు. ఇక అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ లుగా ఎంతో మంది రజకులు ఈ మహానగరంలో పని చేస్తూ ఉన్నారని.. వారికి కనీస వేతనం దక్కడం లేదని బాధను వ్యక్తం చేశారు దుండ్ర కుమారస్వామి. 50 ఏళ్లు నిండిన రజకులకు వద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, వత్తి చెరువులు, స్థలాల మీద పూర్తి యాజమాన్య హక్కు కల్పించాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు.
ఎంతో మంది రజకులు చిన్న వయసులోనే ఈ వృత్తిలోకి వచ్చారని.. ఎంతో కష్టపడుతూ ఉన్నారని.. ఓ వయసు వచ్చాక వారికి మోకాళ్లు అరిగిపోవడం, ఒంట్లో ఓపిక లేకుండా పోయిందని.. అలాంటి వాళ్ళ కోసం పింఛన్ తీసుకుని రావాలని.. ఇన్నాళ్లూ కష్టపడి పని చేశారని.. ఇకపైనా వారికి ప్రభుత్వాలు కాస్త తోడ్పాటును ఇవ్వాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే రజకుల సమస్యల గురించి చర్చించి పరిష్కరించాలని కోరారు. రజకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్లుగా పని చేస్తున్న వారికి వ్యక్తిగత రుణాలివ్వాలని కూడా దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. రజకుల రక్షణకు అట్రాసిటీ చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖలో రజకుల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని కుమారస్వామి కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని భావిస్తూ ఉన్నామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు.