కుల సర్వేకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి
- అఖిల పక్ష, కుల సంఘాల సదస్సు డిమాండ్
• ఉత్తర్వుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది – డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు.
• లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ ముందే “సర్వే” కు ప్రభుత్వ ఉత్తర్వులు కోరుకుంటున్నాం – ప్రొఫెసర్ కోదండరామ్.
• అఖిల పక్షంగా వెళ్ళి మరోసారి ముఖ్యమంత్రిని కలుద్దాం – ఆకునూరి మురళి, రెటైర్డ్ ఐ.ఎ.ఎస్.
• ఉత్తర్వులు వస్తాయని మాకు సీఎం పై నమ్మకం ఉంది – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి.
• కుల సర్వే త్వరిత గతిన చేపట్టక పోతే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు గల్లంతే – ప్రొఫెసర్ మురళీ మనోహర్.
రాష్ట్రంలోని ప్రజలందరి వివరాలు కులాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించబోయే సామాజిక, ఆర్థిక, కుల సర్వే కార్యాచరణకు వెంటనే ఉత్తర్వులను, మార్గ దర్శకాలతో ఇవ్వాలని అఖిల పక్ష, కుల సంఘాల సమావేశం కోరింది. లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఉత్తర్వులను విడుదల చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
బుధవారం నాడు నగరంలోని కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్ లో జాతీయ బీసీ దళ్, తెలంగాణ బీసీ జన జాగృతి సంయుక్తంగా అఖిల పక్ష కుల సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించింది. సమావేశానికి ఆచార్య ఎం. భాగయ్య సభాధ్యక్షులుగా వ్యవహరించారు. సమన్వయకర్తలుగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి, తెలంగాణ బీసీ జన జాగృతి అధ్యక్షులు కె. పి. మురళి కృష్ణ వ్యవహరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ఎమ్. కోదండరామ్, రిటైర్డ్ IAS అధికారి, సామాజిక ఉద్యమకారుడు ఆకునూరి మురళి, సామాజికవేత్తలు ప్రొఫెసర్ మురళి మనోహర్, ప్రొఫెసర్ సుదర్శన్ రావు, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.
సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ… కుల సర్వేకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలన్న డిమాండ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు, ముఖ్యమంత్రి తో మాట్లాడి ఈ డిమాండ్లను నెరవేర్చే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ… బీసీ కమిషన్ గా తమ వంతు కృషిని చేస్తూనే ఉన్నామని అన్నారు . ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఉత్తర్వులు ఇవ్వడంలో వెనకడుగు వేయబోదని ఆయన పేర్కొన్నారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం “కుల సర్వే” తీర్మానంతో బలహీన వర్గాలలో గొప్ప మద్దతును కూడగట్టుకుందని అన్నారు. సర్వే కు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సుమారు 70 సంఘాలకు చెందిన కుల, ఉద్యోగ, మహిళ, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ పూర్తి మద్దతును ప్రకటించారు.