ఓటు గొప్పదనం.. తెలుసుకో!!
పార్లమెంట్ ఎన్నికల కోలాహలం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే నగరం నుంచి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత ఊళ్ళకి భారీగా తరలి వెళ్లారు. దీంతో పట్నంలోని దారులన్నీ నిశ్శబ్దంగా మారాయి.. మరోవైపు హైదరాబాదు లోక్ సభ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది.. అయితే పోలింగ్ మందకోడిగా కొనసాగుతుంది.
సిటీలోని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటింగ్ చేసిన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పోలింగ్ శాతం పెంచాలని కోరారు.. ఓటు హక్కు వినియోగించడం కోసం ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.
మీరు నమ్మే మీ నాయకుడికి తప్పకుండా ఓటు వేయండని కోరారు.. ఒక వేళ మీకు ఏ నాయకుడూ నచ్చకపోతే.. పోలింగ్ బూత్ కు వెళ్లి కనీసం నోటా బటన్ అయినా నొక్కేసి రావాలన్నారు.. ప్రతి ఓటు ప్రజల జీవితాలని మెరుగుపరచడానికి ఉపయోగపడే అమూల్యమైన సాధనం అని కుమారస్వామి పేర్కొన్నారు.. తాను ఒక్క ఓటు వేయకపోవడం వల్ల దేశ భవిష్యత్తుకు గాని, నాయకుడికి గాని ఎటువంటి నష్టం ఉండదనే భావనను వీడాలని తెలిపారు.
ఒక్క ఓటుతో ప్రభుత్వాలు మారిపోయిన సంఘటనలను గుర్తు తెచ్చుకోవాలని కోరిన కుమారస్వామి.. ప్రతి పౌరుడు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేదే మీ ఆయుధం. ధర్మం వైపు నిలబడండి. క్రిమినల్స్ కు, దోపిడీ దారులకు.. ఓటును కట్టబెట్టవద్దు. మన తలరాతలను మార్చే నాయకులను ఓటు ద్వారా ఎన్నుకోవచ్చని వివరించారు..
మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు చాటుతుందని తెలిపిన ఆయన.. ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికీ చాలా తేడా ఉందన్నారు.. ప్రజాస్వామ్యంలో నువ్వు ముందు ఓటు వేస్తావు. తర్వాత ఆదేశాలు పాటిస్తావు. నియంతృత్వంలో ఓటు ఉండదు.. అని చార్లెస్ బుకోవ్ స్కీ చెప్పిన మాటను గుర్తు పెట్టుకోండని సూచించిన కుమారస్వామి.. ఓటు వేస్తే ప్రభుత్వాలని ధైర్యంగా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు..
ఓటును ఉపయోగించుకోవడం ద్వారా తప్పు చేసే నాయకులను నడిరోడ్డున నిలబెట్టి నిలదీయగల ధైర్యం వస్తుందని.. అలాగే ప్రజాస్వామ్య వ్యతిరేకులకు శిక్ష వేయగలమని తెలిపారు.. సమాజంలో మార్పు రావాలని కోరుకొంటే సరిపోదు. ఆ మార్పుకు మొదటి అడుగు నువ్వు వేసే ఓటు.. అందుకే బద్దకాన్ని వీడి ని ఓటు హక్కుని వినియోగించుకొని ఆ మార్పును చూడాలని కోరారు..
ఓటు వెయ్యకపోతే లెక్కలోకి రావని తెలిపిన దుండ్ర కుమారస్వామి.. రాజును.. బంటును.. సమానంగా చూసే గొప్పదనం ప్రజాస్వామ్యానిదన్నారు. ప్రధాని అయినా సామాన్యుడైనా ఓటు ముందు అంతా సమానమే అని గమనించాలని కోరారు..