తెలంగాణ టెంపుల్స్ టూర్
వేసవి సెలవుల్లో రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాలను కలుపుతూ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది. తెలంగాణ టెంపుల్స్ టూర్ పేరుతో బుధవారం నుంచి ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాలను సందర్శించేందుకు వీలుగా రూపొందించిన తెలంగాణ టెంపుల్స్ టూర్‌ను వారాంతంలో నిర్వహించనున్నట్టు టీఎస్‌టీడీసీ తెలిపింది. ప్యాకేజీలో భాగంగా యాదాద్రి, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు, కాళేశ్వరం, కోటిలింగాల, ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, వర్గల్ సరస్వతి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ రెండురోజుల ప్యాకేజీలో ఏసీ హైటెక్, వోల్వో కోచ్, మినీ కోచ్‌కు వేర్వేరు టారిఫ్‌లు నిర్ణయించారు. ప్రతి శనివారం ఉదయం 7.30లకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి బయలుదేరే తెలంగాణ టూరిజం బస్సు ఆదివారం రాత్రి 10.30 గంటలకు తిరిగి అక్కడకు చేరుకుంటుంది. టికెట్ల కోసం 040-29801039 నంబర్‌లో లేదా www.tstdc.in లో సంప్రదించవచ్చు.