తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సభ్యులందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా నడుపుకోవడం మనందరి బాధ్యత. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందాం. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో మీరంతా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అందరం కలిసి సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం అని విజ్ఞప్తిచేశారు.
తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రకటన చేశారు. గురువారం సాయంత్రం ఐదుగంటల వరకు నామినేషన్లు తీసుకున్నామని, అన్ని పార్టీల సభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రతిపాదించారని తెలిపారు.
శనివారం 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం
రాష్ట్ర రెండో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రసంగిస్తారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.