తెలంగాణ కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి
కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను వెలువరించింది. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్నిశాఖల్లో అమలుపరచాలంటూ తెలంగాణ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకనుంచి రాష్ట్రంలో నియామకాలన్నీ కొత్త జోనల్ విధానంలోనే జరుగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకొని ఏడు జోన్లను, రెండు మల్టీజోన్లను ఏర్పాటుచేసింది. అలాగే పోలీస్ విభాగానికి ప్రత్యేక జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. కొత్తజోనల్ వ్యవస్థలో స్థానిక కోటా కింద 95 శాతం, ఓపెన్ కోటా కింద 5 శాతం చొప్పున జరిగే నియామకాల్లో పూర్తిగా 100 శాతం ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకే దక్కనున్నాయి. ఓపెన్ కోటాలోని 5 శాతం ఉద్యోగాలకు కూడా తెలంగాణ నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు కొత్త జోనల్ వ్యవస్థ అవకాశం కలిగించింది.
సమైక్య రాష్ట్రంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తుచేసి భవిష్యత్తులో అటువంటి అన్యాయాలకు ఆస్కారం లేకుండా పటిష్ఠమైన నూతన వ్యవస్థను తీసుకొచ్చారు. మా ఉద్యోగాలు మాకే అంటూ నినదించిన తెలంగాణ నిరుద్యోగుల కల సాకారమైంది. కొత్త జోనల్ వ్యవస్థలో మల్టీ జోనల్ పోస్టుల కింద గ్రూప్-1 అధికారులుగా కూడా తెలంగాణ బిడ్డలనే నియమించేందుకు మార్గం సుగమమైంది. కేవలం నియామకాలకే పరిమితంకాకుండా అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలకు కూడా కొత్త వ్యవస్థ అవకాశం కల్పించింది.
స్థానికత
ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా తెలంగాణ బిడ్డలకే అవకాశాలు వచ్చేవిధంగా స్థానికతను వర్గీకరించారు. 1వ తరగతి నుంచి 7వ తరగతిలోపు వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లా స్థానికుడిగా వర్గీకరించాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
కొత్త నోటిఫికేషన్లలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిల్లోని ఉద్యోగాల భర్తీలో 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. ఈ విధానంతో మారుమూల ప్రాంతాల నిరుద్యోగులకు లబ్ధిచేకూరుతుంది. 31 జిల్లాలవారీగా నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో ఏప్రాంతం వారు ఆ ప్రాంతంలోని నిరుద్యోగులతోనే పోటీపడతారు. గ్రామీణ యువత పట్టణాల్లోని నిరుద్యోగులతో పోటీపడాల్సిన అవసరం ఉండదు. దీంతో అందరికీ సమాన అవకాశాలు లభించి ప్రాంతాల మధ్య అసమానతలు తొలగిపోనున్నాయి. మిగిలిన 5 శాతం ఉద్యోగాలను కూడా తెలంగాణ నిరుద్యోగులతోనే భర్తీచేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే శాఖలవారీగా ఖాళీల వివరాలను సేకరించడంతోపాటు నియామకాల విధివిధానాలపై కసరత్తు ప్రారంభించాయి. దీంతో కొత్త జోనల్ వ్యవస్థ తొలి ఫలాలు త్వరలోనే తెలంగాణ యువతకు దక్కనున్నాయి.