తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అక్టోబర్ 27న ప్రారంభమైన శాసనసభ శీతాకాల సమావేశాలు 16 రోజుల పాటు కొనసాగాయి. మొత్తం 69 గంటల 25 నిమిషాల పాటు జరిగిన శాసనసభలో 11 అంశాలపై చర్చ జరిపారు. 11 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
అసెంబ్లీలో.. ఫీజు రియింబర్స్‌మెంట్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతు సమన్వయ సమితులు, భూ రికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్స్, మైనార్టీల అభివృద్ధి, గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు, హైదరాబాద్ నగరాభివృద్ధి, 24 గంటల విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. శుక్రవారం (నవంబర్ 17) ‘పరిపాలన సంస్కరణలు – నూతన పాలన వ్యవస్థ’ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ వివరణ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.