కేరళ బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ జి. శశిధరన్ తో తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ డాII వకుళాభరణం భేటీ
తెలంగాణ బీసీ కమిషన్ మిక్కిలి క్రియాశీలంగా పని చేస్తుందని, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడంలో ఛైర్మన్ డాII వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యుల కృషికి కితాబు ఇచ్చారు కేరళ బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ శశిధరన్.
గురువారం నాడు తిరువనంతపురం, వెల్లాయంబలం కౌడియార్, అయ్యన్ కలి భవన్ లో గల కేరళ బీసీ కమిషన్ కార్యాలయంలో డాII వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మర్యాదపూర్వకంగా జస్టిస్ శశిధరన్ ను కలిశారు. ఈ సందర్భంగా కేరళ ఛైర్మన్, డాII వకుళాభరణం ను శాలువాతో సన్మానించారు, ఆ రాష్ట్ర కమిషన్ పలు నివేదికల ప్రతులను అందజేశారు. వారిరువురు సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీ లో అక్కడి కమిషన్ సభ్యుడు డాII ఎ. వి. జార్జ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ సంక్షేమ పథకాలు, విధులు, నిధుల గురించి డాII వకుళాభరణం వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల శాతంను స్థిరీకరించడానికి డెడికేటెడ్ కమిషన్ గా తాము చేస్తున్న పనిని ఆయనకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా త్వరలో చేపట్టబోయే సామాజిక, ఆర్థిక కుల సర్వే అంశంపై సుదీర్ఘంగా చర్చించు కున్నారు. తెలంగాణ లో ఎక్కడా లేని విధంగా పథకాలు కొనసాగుతుండడం పట్ల కేరళ ఛైర్మన్ అభినందించారు. ఈ నేపధ్యంగా తెలంగాణ బీసీ కమిషన్ల నివేదికలు, వివిధ పథకాల ప్రభుత్వ ఉత్తర్వులు , ప్రస్తుత బీసీ కమిషన్ కార్యాచరణ ప్రణాళిక మున్నగునవి డాII వకుళాభరణం, కేరళ ఛైర్మన్ కు అందజేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంపూర్ణ సహకారం వల్లనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా చేపట్టగల్గుతున్నట్లు డాII వకుళాభరణం, శశిధరన్ దృష్టికి తెచ్చారు.