కేరళకు 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిన తెలంగాణ ప్రభుత్వం
గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఇప్పటికే వరద బాధితుల కోసం 25 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించిన సర్కార్… తాజాగా 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళకు పంపించింది. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి 18 లారీలు.. మరో 6 లారీలు వివిధ జిల్లాల నుంచి బయలుదేరాయి.
మంత్రి ఈటెల రాజేందర్ జెండా ఊపి బియ్యం వాహనాలను కేరళకు పంపించారు. బియ్యం నాణ్యత, తూకంను తనిఖీలు చేసి, లోడింగ్ చేశారు. అటు వాహనాలకు జీపీఎస్ యంత్రాలను అమర్చారు. కేరళ ప్రభుత్వ సూచనల మేరకు కొచ్చి-ఎర్నాకులం సమీపంలోని ఎడతల టౌన్‌లో ఉన్న సిడబ్లుసి గోదాముల్లోకి గురువారం సాయంత్రం కల్లా ఈ బియ్యాన్ని చేరవేయనున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్.. ” తెలంగాణ ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి అండగా ఉంటుంది. దేవభూమిగా వర్ధిల్లిన ఆ రాష్ట్రాన్ని ప్రకృతి అతలాకుతలం చేసింది. దేశ ప్రజలంతా కేరళ రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలి” అని ఆయన పిలుపునిచ్చారు.