తెలంగాణ పోలీస్‌శాఖలో భారీ నియామకలు
నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. ఇప్పటికే పోలీస్‌శాఖలో భారీసంఖ్యలో సిబ్బంది నియామకం చేపడుతున్న ప్రభుత్వం వివిధ హోదాల్లో కలిపి తాజాగా మరో 14,177 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి హోంశాఖ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర డీజీపీ పరిధిలో ఉండే ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీచేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్‌శాఖను బలోపేతం చేయడంలో భాగంగా సిబ్బంది నియామకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభు త్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 14,177 పోస్టుల్లో సివిల్ ఎస్సై 710 పోస్టులు, ఏఆర్ ఎస్సై 275 పోస్టులు, టీఎస్‌ఎస్పీ ఎస్సై 175 పోస్టులతోపాటు సివిల్ కానిస్టేబుల్ 5002 సహా మొత్తం ఏడు క్యాటగిరీల్లో భర్తీచేయనున్న పోస్టుల వివరాలు ఉత్తర్వుల్లో వెల్లడించారు. గతేడాదిలో వివిధ విభాగాల్లో కలిపి ఒకేసారి 9226 కానిస్టేబుళ్ల భర్తీకి పోలీస్‌శాఖ నోటిఫికేషన్ ఇవ్వగా, వారిలో 8824 మంది కానిస్టేబుళ్లు విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకుని ఇటీవలే విధుల్లోకి చేరారు. మరోమారు పోలీస్‌శాఖలో భారీ సంఖ్యలో పోస్టులు భర్తీకి అనుమతి రావడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.