ప్రగతి భవన్ : ఈరోజు ప్రగతి భవన్ లో, తాయ్ పే (Thai pei) ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్ (TECC) బృందం మంత్రి కేటీఆర్ ని కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాలసీలు, ముఖ్యంగా ts-ipass లాంటి ప్రభుత్వ విధానాలను మంత్రి కేటీఆర్, TECC డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ కి వివరించారు. ముఖ్యంగా తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఇతర ప్రముఖ రంగాలకు సంబంధించి తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు.
తైవాన్ కు చెందిన ప్రముఖ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను స్వయంగా తైవాన్ లో పర్యటించి తెలంగాణలోని వ్యాపార అనుకూలత గురించి వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం తైవాన్ పారిశ్రామిక వర్గాల పెట్టుబడులకు ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ ని సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటు చేసేందుకు గతంలో చేసిన ప్రతిపాదన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలత ఇక్కడి మౌలిక వసతుల నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అనేక రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. తైవాన్- తెలంగాణ మధ్య పెట్టుబడుల విషయంలో సహకరించాల్సిందిగా డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ ను మంత్రి కేటీఆర్ కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలత విషయంలో ఉన్న అనేక సానుకూల అంశాలు తనకు తెలుసునని, ఇక్కడ ఉన్న పెట్టుబడి అవకాశాలను, తైవాన్ పారిశ్రామిక రంగానికి పరిచయం చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు డైరెక్టర్ జనరల్ వాంగ్ హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్న ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు పలు ఇతర రంగాల్లోని ప్రముఖ కంపెనీలతో ఒక వర్చువల్ ఇన్వెస్ట్మెంట్ సెషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తైవాన్ ఎకనమిక్ కల్చరల్ TECC మరియు Taiwan External Trade Development Council – TAITRA, ఇన్వెస్ట్ ఇండియాల సంయుక్త ప్రతినిధి బృందానికి ఐటి శాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్, ఈవి(EV) డైరక్టర్ సుజయ్ కారంపూరి ఒక ప్రజంటేషన్ ద్వారా తెలంగాణలో ఉన్న వివిధ పెట్టుబడి అవకాశాలపైన వివరాలు అందించారు. మంత్రితో జరిగిన ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.