మరణానికి వీలునామా’ రాసుకునే అవకాశాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం కల్పించింది
నయంకాని వ్యాధితో మంచాన పడి, శాశ్వతంగా కోలుకోలేని పరిస్థితి వచ్చినా… ‘చచ్చినట్లు’ బతికి తీరాల్సిందేనా? ఆ బాధలు పడాల్సిందేనా? అనే ప్రశ్నకు సుప్రీం కోర్టు ‘అక్కర్లేదు’ అనే సమాధానం ఇచ్చింది. ‘మరణానికి వీలునామా’ రాసుకునే అవకాశాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం కల్పించింది. కొన్ని షరతులు, మార్గదర్శకాలకు లోబడి.. పరోక్ష పద్ధతిలో రోగికి మరణం ద్వారా ఉపశమనం కల్పించవచ్చునని తెలిపింది. ‘‘నయంకాని వ్యాధితో బాధపడుతున్న నేను… ఎప్పటికీ కోలుకోలేని పరిస్థితి వచ్చినప్పటికీ అలాగే బతకాలని లేదు. తదుపరి చికిత్స నిలిపివేసి నాకు గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించండి’’ అని రోగి స్వయంగా తన ‘మరణేచ్ఛ వీలునామా’ రాసుకోవచ్చునని తెలిపింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. పరోక్ష కారుణ్య మరణం (ప్యాసిప్ యుథనేషియా)పై ధర్మాసనంలోని ఇతర సభ్యులు… జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, ‘మరణేచ్ఛ వీలునామా’ పై అందరూ ఒకే మాట చెప్పారు. నిజానికి… అరుణా షాన్‌బాగ్ కేసులో 2011లోనే సుప్రీంకోర్టు పరోక్ష కారుణ్య మరణాన్ని ప్రసాదించవచ్చునని తెలిపింది. ‘జీవించే హక్కులో మరణించే హక్కు భాగమే’ అని 1996లోనే రాజ్యాంగ ధర్మాసనం జ్ఞాన్‌కౌర్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ధారించింది. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని, మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛ ంద సంస్థ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
ముందస్తుగా రాసిన వీలునామా, పరోక్ష కారుణ్య మరణం అనుమతించదగినవని తెలిపింది. ఆ వీలునామాను ఎవరు అమలు చేయాలి, పరోక్ష కారుణ్య మరణాన్ని మెడికల్ బోర్డు ఏ పరిస్థితుల్లో మంజూరు చేయాలి అన్న దానిపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ అంశంపై ఒక చట్టం రూపొందేవరకు కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. సజీవ వీలునామాను గుర్తించాలని కోరుతూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రోగి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నప్పుడు, ప్రాణం నిలబెడుతున్న వ్యవస్థను తొలిగించే విషయంలో మెడికల్ బోర్డులు నిర్ణయం తీసుకునే ముందు కొన్ని మార్గదర్శకాలు ఉండాలని పేర్కొంది. పరోక్ష కారుణ్య మరణం అంశంపై ధర్మాసనంలోని నలుగురు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని, కానీ సజీవ వీలునామాను అనుమతించే విషయంలో మాత్రం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా చెప్పారు.