తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే:
రాష్ట్ర ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ సమగ్ర కుటుంబ సర్వే
సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించండి
రాష్ట్రంలో అసమానతలను రూపుమాపడానికి ఈ సమగ్ర కుల సర్వే ఉపయోగపడుతుంది
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా ముందుకు కొనసాగుతోందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న సమగ్ర సర్వేలో దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పలు రాష్ట్రాల ప్రజలు తెలంగాణ తరహాలో తమ రాష్ట్రంలో కూడా సర్వేను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత 12 రోజుల సర్వే ఫలితంగా 50 శాతం సమగ్ర కుల సర్వే పూర్తి చేశారని దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఇక అధికారులు సేకరించిన వివరాలను అత్యంత భద్రంగా ఉంచాలని, ప్రజల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సర్వేలో సేకరించిన డేటాను ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఎంత వరకు కల్పించవచ్చు అనేది నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగానే బీసీ డెడికేటెడ్ కమిషన్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే కేవలం 12 రోజుల్లోనే 58.3% పూర్తయింది. సర్వేలో ముందుగా నవంబర్ 6-8 తేదీల్లో ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. ఈ దశలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. నవంబర్ 9న ఇంటింటి వివరాల సర్వే ప్రారంభమైంది. ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది. ప్రజల స్థితిగతులు తెలుసుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను విస్తృతం చేయడంతో పాటు కొత్త పథకాల అమలు కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్వే గురించి రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని సూచించారు.