భారత్‌లో తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే విమానం గాల్లోకి ఎగిరింది. సోమవారం డెహ్రాడూన్- ఢిల్లీ మధ్య ప్రయోగాత్మకంగా బంబార్డియర్ క్యూ-400 శ్రేణి విమానాన్ని బయోఫ్యూయల్‌తో నడిపారు. తొలి ప్రయాణం విజయవంతమైందని విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రకటించింది. పాక్షిక జీవ ఇంధనంతో దీన్ని నడిపినట్లు తెలిపింది. దేశీయ విమానయానరంగంలో తొలిసారి చేపట్టిన ఈ జీవఇంధన ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్‌లో అత్యంత ఖరీదైన ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఇంధన వాడకం తగ్గనున్నది. అదే జరిగితే విమానయానరంగంలో పూర్తిగా జీవ ఇంధనాన్ని వాడే తొలి అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించనున్నది. విమానయాన రంగంలో ఆ ఘనత సాధించిన అమెరికా, ఆస్ట్రేలియాల సరసన భారత్ కూడా చేరనున్నది. సోమవారం ఉదయం డెహ్రాడూన్ జాలీగ్రాంట్ విమానాశ్రయం నుంచి ఈ జీవఇంధన విమానాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రారంభించారు. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ, స్పైస్‌జెట్ అధికారులు.. మొత్తం 20మంది ప్రయాణికులతో ఈ విమానం గాల్లోకి ఎగిరింది. 25నిమిషాల్లోనే విమానం దేశరాజధానికి చేరుకుంది.
78సీట్లున్న క్యూ-400 విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, సురేశ్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, హర్షవర్ధన్, జయంత్ సిన్హా, స్పైస్‌జెట్ సీఈవో అజయ్ సిన్హా దానికి స్వాగతం పలికారు. పునరుత్పాదక వనరుల నుంచి ఈ జీవ ఇంధనాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తయారు చేసింది. వ్యవసాయ, తినేందుకు వినియోగించలేని నూనెలు, పారిశ్రామిక, మున్సిపల్ వాడల నుంచి సేకరించిన వ్యర్థాలతో ఈ ఇంధనాన్ని తయారు చేశారు. ప్రధానంగా జట్రోపా మొక్కల నుంచి ఈ బయో ఫ్యూయల్‌ను ఉత్పత్తి చేసేందుకు సుమారు 500 వ్యవసాయ కుటుంబాలు పనిచేశాయి. విమానం కుడి ఇంజిన్‌లో 25శాతం జీవ ఇంధనాన్ని, ఎడమ ఇంజిన్‌లో 75శాతం సాధారణ ఎయిర్ టర్బైన్ ఇంధనాన్ని నింపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు జీవ ఇంధనం దోహదపడుతుందని స్పైస్‌జెట్ సీఈవో అజయ్ సిన్హా చెప్పారు. జీవ ఇంధన వాడకం వల్ల విమాన నిర్వహణ, ప్రయాణ వ్యయం తగ్గుతుంది. తద్వారా పర్యావరణానికి, ప్రయాణికులకూ లాభమే అని అజయ్‌సిన్హా తెలిపారు.
ప్రత్యేక పాలసీ రూపకల్పనలో ప్రభుత్వం
విమానయాన రంగంలోనూ జీవ ఇంధన వినియోగాన్ని మరింత పెంచే దిశగా ప్రత్యేక పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. స్పైస్‌జెట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే క్యాబినెట్ ముందు ప్రతిపాదన పెట్టనున్నట్లు గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనం కాలుష్యకారకాలనే కాకుండా దిగుమతి వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని పౌర విమానయానశాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు.