పిట్స్‌బర్గ్ నగరంలోగల యూదుల ప్రార్థనాలయంపై దుండగుడు కాల్పులు
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్ నగరంలోగల యూదుల ప్రార్థనాలయంపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం సబ్బాతు ప్రార్థనలు జరుగుతుండగా, ఆలయంలోపలికి చొచ్చుకు వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఐక్యరాజ్యసమితికి చెందిన ఇద్దరు శాంతిదూతలు, ఒక పోలీసు కూడా ఉన్నట్టు తెలిసింది. దుండగుడు యూదుల వ్యతిరేకి అని, అతని పేరు రాబర్ట్ బవర్స్ (46)అని పోలీస్ అధికారి కోరే ఒకానర్ తెలిపారు. స్కిరిల్‌హిల్‌లోని ఈ ప్రార్థనాలయం వద్ద ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు యూదులు ప్రార్థనలు జరుపుతారు. అదే సమయంలో లోపలికి చొచ్చుకువచ్చిన దుండగుడు యూదులంతా చావాలి అని అంటూ ఏఆర్-15 రైఫిల్‌తో కాల్పులు ప్రారంభించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన రాబర్ట్ అక్కడ నలుగురిపై కాల్పులు జరిపాడని, ఆ తరువాత బేస్‌మెంట్‌లోకి వెళ్లి అక్కడ మరో ముగ్గురిని హతమార్చాడని చెప్పారు. అక్కడి నుంచి మూడో అంతస్తుకు వెళ్లాడని, అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకోవడంతో వారిపై కూడా కాల్పులు జరిపాడని తెలిపారు. ఆ తరువాత తనను తాను కాల్చుకొని పోలీసులకు లొంగిపోయాడన్నారు. కాల్పులు జరిగినప్పుడు ప్రార్థనాలయంలో వందమంది వరకు ఉన్నారని చెప్పారు. యూదులు భారీ సంఖ్యలో అమెరికాకు వలస వస్తున్నారని, ఈ రోజు వారి అంతు చూస్తానని అతడు అంతకుముందు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాల్పుల ఘటనలో ఆరుగురు గాయపడ్డారని, వీరిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారని పిట్స్‌బర్గ్ పోలీస్ కమాండర్ జేసన్ లాండో చెప్పారు. అయితే మృతులు ఎవరన్నది మాత్రం వెల్లడి కాలేదు. కాల్పులు జరిపిన దుండగుడు పోలీసులకు లొంగిపోయాడని, అతడిని మెర్సీ హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు. ప్రార్థనాలయం వద్ద సరైన భద్రత లేకపోవడం వల్లే దుండగుడు లోపలికి వచ్చాడని స్థానికులు పేర్కొన్నారు. కాల్పుల ఘటనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు సురక్షిత ప్రదేశంలో ఉండాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.