మహారాష్ట్ర గ్రామీణ మహిళలకు శుభవార్త.
..కేవలం ఐదు రూపాయలు చెల్లిస్తే చాలు 8 శానిటరీ ప్యాడ్స్ అందించేందుకు వీలుగా మహారాష్ట్ర మహిళా. శిశు అభివృద్ధి శాఖ ‘అస్మిత’ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రుతుక్రమం సమయంలో ఎక్కువమంది గ్రామీణ మహిళలు శానిటరీ ప్యాడ్స్ వాడటం లేదని సర్వేల్లో తేలింది. ఇటీవల ‘ప్యాడ్ మ్యాన్’ చిత్రం విడుదలై సంచలనం రేపడంతో మహిళలకు శానిటరీ ప్యాడ్స్ వినియోగం విషయం చర్చనీయాంశంగా మారింది. గ్రామీణ మహిళలు ఏడాదికి రూ.182.40 పైసలు చెల్లిస్తే చాలు ఏడాది పొడవునా వారికి అవసరమయ్యే శానిటరీ ప్యాడ్స్ అందిస్తామని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. బాలికలతోపాటు మహిళల మెరుగైన ఆరోగ్యం కోసం సబ్సిడీ ధరలకు శానిటరీ ప్యాడ్స్ అందించేలా కొత్త పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పంకజా ముండే వెల్లడించారు. 8 శానిటరీ ప్యాడ్స్ ఉన్న ప్యాకెట్ కు ప్రభుత్వం సబ్సిడీగా రూ.15.29 ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. ‘ప్యాడ్ మ్యాన్’ చిత్ర హీరో అక్షయ్ కుమార్ ను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించి అస్మిత పథకాన్ని మార్చి 8వతేదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పంకజా ముండే వివరించారు.