ప్రభుత్వభూములు అప్పనంగా మింగేద్దామనుకునే భూభాకాసురుల గుండెల్లో దడ పుట్టిస్తున్న రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రకళ, గండిపేట మండల తహసిల్దారు మరియు వారి కార్యాలయ సిబ్భంది. విధి నిర్వహణలో భాగంగా కబ్జాకు గురైన సుమారు 3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తేది 30-12-2019న కాపాడి వారి ప్రత్యేకతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ డివిజన్, గండిపేట మండలం, వట్టినాగులపల్లి గ్రామంలోని సర్వే నం.132 ప్రభుత్వ భూమిలో నివాసగృహాలు లేని కొందరికి ప్రభుత్వం గతంలో 60 గజాల చొప్పున ఇళ్ళ పట్టాలు మంజూరు చేసింది. కాగా, కొందరు అక్రమార్కులు ఈ సర్వే నంబరు లోని ప్రభుత్వ మిలుగు భూమిని దర్జాగా కబ్జా చేసి అదే 60 గజాల చొప్పున ప్లాట్లు గా చేసి ఒక్కో ప్లాటు సుమారు 40.ల చొప్పున ఇతరులకు నోటరీ డాకుమెంట్స్ ద్వారా అమ్ముతున్నారు. ఇలా ప్రభుత్వ భూమిలో స్థలం కొనుగులు చేసిన వారు దశల వారిగా ఇళ్ళు నిర్మించే క్రమంలో ప్రహరీలు నిర్మించి ఒక్కో రూము చొప్పున నిర్మాణాలు చేపడుతుండగా, ఇట్టి ప్రభుత్వ భూమి కబ్జా విషయం రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రకళ దృష్టికి రావడంతో అట్టి నిర్మాణాలను పూర్తిగా తొలగించవలసిందిగా స్థానిక గండిపేట మండల తహశీల్దారును ఆదేశించారు. ఆర్.డి.ఓ. గారి ఆదేశాల అమలులో భాగంగా తహశీల్దారు రాజశేఖర్ గారు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ వాణి మరియు గ్రామ రెవెన్యూ అధికారి
నగేష్ తక్షణమే పూనుకొని సర్వే నం.132 లో కొత్తగా వెలసిన అన్ని అక్రమ కట్టడాలను జె.సి.బి.తో పూర్తిగా కూల్చివేసి విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించారు. ప్రభుత్వభుముల్లో పాగా వేద్దామనుకునే వారి ఆటలు తమముందు సాగవని, పౌరులు ఎవరైనా ప్రభుత్వభుములు కబ్జా అవుతున్నట్టు వారి దృష్టికి వచ్చినట్టయితే భాద్యతగా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, అట్టి భూములను తాము ఎటువంటి అధికారిక, రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గకుండా కాపాడుతామని, అది తమ ప్రథమ కర్తవ్యం అని ఆర్.డి.ఓ. చంద్రకళ అన్నారు. అంతే కాకుండా మండల పరిధిలో ఇటువంటి భూకబ్జాలకు పాల్పడే వారిపై ల్యాండ్ గ్రాబింగ్ ఆక్ట్ క్రింద చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహశీల్దారు రాజశేఖర్ హెచ్చరించారు. పిర్యాదులకు వెంటనే స్పందించి కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలను కాపాడిన అధికారులను సిబ్బందిని ప్రజలు అభినందిస్తున్నారు.
