ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఇప్పటికే సినిమాలు, సీరియళ్లు, వీడియోగేమ్‌లు, అమెజాన్ ప్రైమ్‌లు..అబ్బో చాలానే వచ్చేశాయి. అయినప్పటికీ మన భారతీయులకు రామాయణ, మహాభారతం లాంటి పౌరాణిక గాధలపై మమకారం ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ, ఇప్పటికీ అదే ఆదరణ, అదే భక్తి వాత్సల్యం. దీనికి నిదర్శనమే ఇప్పుడు దూరదర్శన్ ఛానెల్‌కు లభిస్తున్న రేటింగ్. ప్రస్తుతందూరదర్శన్‌లో ప్రసారమవుతున్న రామాయణ్, మహాభారత్ సీరియల్స్.. రేటింగ్స్‌లో దుమ్ముదులిపే రికార్డులను సాధిస్తుంది. 33 ఏళ్ల క్రితం ప్రసారమైన ఈ సీరియల్స్..లాక్‌డౌన్ పుణ్యమా అని మళ్లీ టెలికాస్ట్ అయ్యాయి.
రామానంద్‌సాగర్, బిఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన రామాయణ్, మహాభారత్ సీరియళ్లకు భారీ ఆదరణ లభిస్తోంది. దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ మొదటి నాలుగు ఎపిసోడ్‌లకు 170 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు బార్క్ ఇండియా తెలిపింది. వీటిలో ఆదివారం ప్రసారమైన ఒక్క ఎపిసోడ్‌కే 5కోట్ల వ్యూయర్‌షిప్ నమోదైంది.దేశ చరిత్రలోనే సీరియల్స్‌కు ఈ రేంజ్‌లో వ్యూయర్‌షిప్ రావడం ఇదే మొదటిసారి.దీంతో డీడీ ఛానల్ వ్యూయర్‌షిప్ అమాంతం పెరిగింది. దీంతో డీడీ ఛానల్‌కి మునుపెన్నడూ లేనంతగా 650 శాతం లాభాల్లో దూసుకుపోయింది. దీనిపై దూదర్శన్ సీఈవో శశి శేఖర్ మాట్లాడుతూ..”దూరదర్శన్ వీక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. భారతదేశం అంతటా అత్యధిక వీక్షించిన ఛానెల్ ఇదే. మీ అందరి మద్దతుకు కృతఙ్ఞతలు. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి “అంటూ ట్వీట్ చేశారు.