కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక చైర్మన్ సుంకరి కృష్ణ వేణి, కృష్ణ గారి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి, ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గండిమైసమ్మ జంక్షన్ అభివృద్ధి, మల్లంపేట్, భౌరంపేట్ గ్రామాల్లో వర్షపు నీటి కాలువల ఏర్పాటుకు సర్వే, మల్లంపేట్, గాగిల్లాపూర్ గ్రామాల్లో వాటర్ ట్యాంక్ ల నిర్మాణం, మున్సిపాలిటీ ఆమోదించిన రూ.12 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులు, పలుచోట్ల నెలకొన్న కరెంటు సరఫరా సమస్య, వీది కుక్కలకు వాక్సినేషన్ మరియు కుటుంబ నియంత్రణ చర్యలు, జులై 1 నుండి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతిలో చేపట్టబోయే కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు గండిమైసమ్మ జంక్షన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ ద్వారా ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా అవసరమైన చోట ట్యాంకర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. పలు వార్డుల్లో నెలకొన్న కరెంటు సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే చొరవ చూపి పరిష్కరించాలన్నారు. మున్సిపాలిటి ఆమోదించిన నిధులతో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపర్చేందుకు వెంటనే పనులు చేపట్టాలన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో రూ.2.30 కోట్లతో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. వీధి కుక్కలకు వాక్సినేషన్ తో పాటు కుటుంబ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో చేపట్టిన పట్టణ ప్రగతితో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, వచ్చే నెల 1 నుండి తిరిగి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలన్నారు. చివరగా వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. నిధులకు కొరత లేకుండా రాబోయే రోజుల్లో దుండిగల్ ను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ భోగిష్వర్లు, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.