ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు సెమీఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయిపై 21-14, 21-14 తేడాతో వరుస గేముల్లో సింధు గెలుపొందింది. డెన్మార్క్ ఓపెన్లో తనను ఓడించిన చెన్‌పై సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఆత్మవిశ్వాసంతో ఆట ప్రారంభించిన భారత షట్లర్ తొలి నుంచే దూకుడుగా ఆడి పై చేయి సాధించింది. తొలి గేమ్‌ను 21-14 తేడాతో గెలుచుకున్న సింధు అదే ఊపులో రెండో గేమ్‌ను కూడా సొంతం చేసుకుంది.
అంతకు ముందు సింధుతోపాటు కిడాంబీ శ్రీకాంత్, ప్రణయ్ రాయ్ కూడా ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చేరగా.. సైనా నెహ్వాల్ రెండో రౌండ్లో ఓటమితో ఇంటి బాట పట్టింది. ఇటీవల బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మహిళ సింగిల్స్ విభాగంలో సింధు రెండో స్థానంలో కొనసాగుతుండగా, సైనా 11వ స్థానంలో ఉంది. డెన్మార్క్ ఓపెన్ గెలిచిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. శ్రీకాంత్ క్వార్టర్స్‌లో షి యుఖీతో తలపడనున్నాడు.