• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.
• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.
• విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో బీసీ లపై నిర్మాణాత్మక సూచనలకై రాష్ట్ర బీసీ కమిషన్ కృషి.
• దశల వారీగా, బీసీల సామాజిక స్థితి గతులపై శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం కొనసాగిస్తున్న రాష్ట్ర బీసీ కమిషన్.
రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR)) నిర్దేశిత సూచనలమేరకు బీసీల సామాజిక స్థితి గతులను శాస్త్రీయంగా అధ్యయనం చేపట్టి, సమగ్రమైన సిఫారసులతో నివేదికను సమర్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తన కసరత్తును వేగవంతం చేసింది. గత 4 రోజులుగా వివిధ ప్రభుత్వ విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహించింది. కమిషన్ ఛైర్మన్ డా|| వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలలో సభ్యులు సిహెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె. కిశోర్ గౌడ్, సభ్య కార్యదర్శి అలోక్ కుమార్ లు పాల్గొన్నారు. కమిషన్ తన కార్యాచరణలో భాగంగా వారితో సుదీర్ఘంగా సమాలోచనలను చేపట్టింది.
ఇందులో భాగంగా శనివారం నాడు ఖైరతాబాద్ లోని రాష్ట్ర బీసీ కమిషన్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐ.ఏ.ఎస్. తో పాటు ఆ శాఖకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీ, వివిధ కార్పొరేషన్, ఫెడరేషన్ విభాగాల అధికారులు ఎం. చంద్ర శేఖర్, మల్లయ్య భట్టు, డి. శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్. విమలా దేవి, డి.ఆర్. ఉదయ్ కుమార్ లతో కమిషన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. బీసీ సంక్షేమ శాఖలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలు, తీరుతెన్నులు, లబ్ధిదారుల వివరాలు కులాల వారీగా, నిధుల కేటాయింపు, వాటి పూర్తి వివరాలు, విద్యార్థుల, ఉద్యోగుల వివరాలు, వివిధ అంశాల వారీగా సమీక్షను నిర్వహించింది. అలానే కమిషన్ అధ్యయనంలో ఏ విధంగా సహకరించాల్సి ఉంటుందో వివరంగా ఛైర్మన్ డా|| వకుళాభరణం దిశా నిర్ధేశం చేశారు.
ఈ నెల 25 నుండి 30 వ తేదీ వరకు కమిషన్ పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, పౌర సరఫరాల శాఖ, సెర్ప్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ, ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖ, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉన్నత విద్యా మండలి, ఉపాధి మరియు శిక్షణ, మహిళాభ్యుదయ మరియు శిశు సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా భేటీలు. బీసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాలలో (స్థానిక సంస్థలలో) వారి ప్రాతినిధ్యం, పొందిన అవకాశాలు, ప్రయోజనాలపై ఆయా శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని, గణాంకాలను అందజేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ కోరింది. కమిషన్ రూపొందించిన “ప్రత్యేక ఫార్మాట్” లను వారికి అందజేసింది. వాటిలో వివరాలను సేకరించి ఇవ్వాలని కోరింది. తులనాత్మకంగా అధ్యయనం కు వీలుగా అన్ని వివరాలను అందజేయాలని సూచించింది. వివిధ విభాగాలు సమాచారం అందించడంలో సమయ పాలన పాటించాలని, వీలైనంత త్వరగా కమిషన్ కు అందజేయాలని ఛైర్మన్ డా|| వకుళాభరణం కోరారు.