బిసి సంక్షేమ పోరు లో నూతన కెరటం పల్లపోతు భగవాన్ దాసు
ఒక సమాజం బాగుపడాలన్నా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా దానికి ప్రత్యేకమైన పాత్ర వహించే బాధ్యత ఆ ప్రాంత ప్రజలది. అటువంటి ఉద్దేశం గల వారు ఎందరో మన చుట్టూ ఉంటారు కానీ వారి ఆలోచనలను ఒక సరైన మార్గంలో పెట్టడానికి ఒక పెద్ద దిక్కు అవసరం. ప్రజల్లో ఆ స్ఫూర్తి, అవగాహన ఉన్నా వారిని ఒక తాటి మీదకు తెచ్చి, వారికి దశ – దిశ చూపించి, ప్రగతి మార్గం వైపు నడిపించే ఒక శక్తి కావలి. ఆ శక్తే ఒక నాయకుడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రజల మధ్య నుంచి వచ్చి వారికి అండగా నిలుస్తాడో అతనే ఒక స్వచ్ఛమైన నాయకుడు. తన జీవితాన్ని ఎప్పుడైతే ప్రజా సేవకు అంకితం చేసి ప్రజల హృదయాలలో నిలుస్తాడో అతనే ఒక నిజమైన ప్రజా నాయకుడు. జీవితాన్ని కింది స్థాయి నుంచి చూసి, అనుభవించి, అందులోని సమస్యలను ధైర్యంగా ఎదురుకొన్నప్పుడే అటువంటి ఒక నాయకుడు ఉద్భవిస్తాడు.
నేటి రాజకీయ వ్యవస్థ అవినీతి, నిర్లక్ష్యం తో సతమతవుతుంది. దానికి ముఖ్యమైన కారణం చిత్తశుద్ధి లేని నాయకులు. ఇటువంటి వ్యవహారశైలి వల్ల సమాజంలోని ఎన్నో వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. అందులో ప్రధమ స్థానం లో ఉన్నది బడుగు, బలహీన వర్గాలు. కానీ పరిస్థితులు మారుతున్నాయి, పీడిస్తున్న సమస్యలను ధీటుగా అధిగమించాలనే తపన కొందరిలో పెరుగుతుంది. ఆ కొందరిలో ఒకరు పల్లపోతు భవానీ దాస్.
ముదునూరు అనే మారుమూల గ్రామంలో సత్యనారాయణ, రాజేశ్వరి దంపతులకు జన్మించిన మొదటి సంతానం భవానీ దాస్. తండ్రి పాల వ్యాపారం చేసుకోగా తల్లి ఇంటిని చూసుకొనేది. పెద్దగా చదువుకోకపోయినా, భవానీ దాస్ చిన్నపటినుంచి కష్టాలను, జీవితాన్ని అతి దగ్గరగా చూసారు. తన తోటి వాళ్ళ కష్టాలు, వారికి జరుగుతున్న అన్యాయం అతని హృదయాన్ని కదిలించేవి. యుక్త వయసుకు వచ్చాక ఒక నిర్ణయం తీసుకున్న భవానీ హైదరాబాద్ వైపు దృష్టిని పెట్టారు. ఈ మహానగరానికి వచ్చి ఇప్పటికి అతనికి 28 సంవత్సరాలు. తండ్రిని ఏమి అడగవద్దు అన్న ఆత్మాభిమానంతో కేవలం కట్టుబట్టలతో పొట్ట చేతిన పట్టుకుని వచ్చిన భవానీ కి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కానీ ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి అడుగు ఒక లక్ష్యం తో వేశారు.
ఒక సంస్థలో సూపెర్వైజర్ గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. తన ప్రయాణంలో కొందరు పెద్దవారితో పరిచయం పెంచుకుని, తన నిజాయితీ తో వారి మన్ననలను పొంది తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధించారు. కానీ బలహీన, బడుగు వర్గాలకు ఏదో ఒకటి చెయ్యాలనే తపన తగ్గకపోగా ఇంకా పెరిగింది. తండ్రి ఇచ్చిన వ్యాపారం కాదనకుండా ప్రజాసేవే తన జీవితంగా మార్చుకున్నారు. ఆ విథంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తన లక్ష్యాన్ని పట్టుదలతో అందుకున్నారు. బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గారు చేతుల మీదుగా బీసీ దల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితమైన తరువాత బిసి జాతి సంక్షేమం కోసం పోరాటం మొదలుపెట్టిన భవానీ దాస్ ఒక నూతన కెరటంలా ముందుకు వచ్చారు.
బి.సి లలో చైతన్యం తీసుకురావడానికి, వారి సంక్షేమం, హక్కులు, రిజర్వేషన్ల పై పోరాటం చేయడానికి బిసి దళ్ ను తయారు చేయడం జరిగింది. దశాబ్దాలు గడిచినా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంఘికంగా వెనుకబడి ఉండటం చాలా శోచనీయం. వారి ఉనికిని గుర్తించి, వారికి తగిన అవకాశాలను కల్పించడానికి బిసి దళ్ ఉద్భవించి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఈ వర్గం వారిలో చైతన్యం నింపుతూ వస్తుంది. బీసీ దల్ లొ భాగంగా ఉండటం బీసీ జాతి కోసం పోరాటం చాలా సంతోషమని చెప్పాడు.
“బడుగు, బలహీన వర్గాలకి తరతరాలుగా అన్యాయం జరుగుతుంది, వారికి చెందవలసినవి చెందకుండా వారి జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ఈ దుస్థితిని మార్చడానికి నేను నడుం బిగించాను.” అని తన నిర్ణయాన్ని వెల్లడించారు. “ఇది ఒక పెద్ద ప్రయాణం, ఇందులో ఎన్నో పోరాటాలు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని నేను ఎదురుకొని నా ప్రజలకు అండగా ఉండడమే నా ఆశయం.” అని అన్నారు.
ఒక నాయకుడిగా తాను చేసిన సేవలను ఎన్నడూ మరచిపోలేము అంటున్నారు జొన్నవాడ, కొల్లూరు, మహారాజపేట వాస్తవ్యులు. బలహీన వర్గాలకు చెందిన ఎన్నో పేద కుటుంబాలు ఈ రోజు భవానీ దాస్ కృషితో ఒక జీవనోపాధిని పొంది ఎట్టకేలకు మా జీవితాలలో వెలుగు నింపే ఒక నిజమైన నాయకుడు వచ్చాడని అనడం అతిశయోక్తి కాదు. తన నియోజకవర్గమైన గార్డెన్, ఇంద్రా నగర్ లో ఎన్నో కుటుంబాలు భవానీ దాస్ పిలుపు కోసం, అతని పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సదా తయారుగా ఉన్నారు. వారి జీవితాల్లో అయన తెచ్చిన మార్పు అటువంటిది. “నేను పడ్డ కష్టాలు నా తోటి వారు పడకూడదు” అనే ఒకే సిద్ధాంతం తో ఎన్ని అవాంతరాలు వచ్చినా బెదరకుండా తన ప్రయాణాన్ని ఒక ఉద్యమం లా ముందుకు తీసుకువెళ్తున్నారు.
“పాల వ్యాపారానికి సంబంధించిన వివిధ అంశాలలో ప్రభుత్వ సహకారం చాలా అవసరముంది. రానున్న ఎన్నికలలో ఎవరైతే బడుగు, బలహీన వర్గాల సమస్యలకు పరిష్కారం మార్గాలు ఇస్తారో వారికే నాది, నా ప్రజల పూర్తి మద్దతు ఉంటుంది. మా వైపు నుంచి ఎక్కడికి రమ్మన్నా, ఎటువంటి కార్యక్రమం చెయ్యమన్నా నేను సిద్ధమే.” అని తెలియచేసారు.
ఈ విథంగా నిరుపేదలను ఆదుకుంటూ వారికి ‘నేనున్నాను’ అని ఒక చేయూత ఇస్తూ ‘బాధ్యత గల నాయకుడు అంటే ఇలా ఉండాలి’ అని ఒక ఉదాహరణ గా నిలుస్తున్న భవానీ దాస్ బి సి లకు ఒక ఆశాజ్యోతి లా నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు.