తొలిపలుకు న్యూస్ : తెలంగాణకు శుభవార్త … హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ..
ప్రముఖ ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ “ప్లగ్ అండ్ ప్లే” భారతదేశంలో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నామని ప్రకటించింది.
పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ తో “ప్లగ్ అండ్ ప్లే” సంస్థ నాయకత్వ బృందం సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
ఫ్రెంచ్ ప్రభుత్వం మరియు బిజినెస్ ఫ్రాన్స్‌లు నిర్వహిస్తున్న “యాంబిషన్ ఇండియా” ఈవెంట్ సందర్భంగా ఈ సమావేశం జరిగింది.
అతి పెద్ద ఎర్లీ స్టేజ్ ఇన్నోవేటర్ గా, యాక్సిలరేటర్ గా, ప్రఖ్యాత కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ గా పేరొందిన “ప్లగ్ అండ్ ప్లే” నెట్‌వర్క్‌లో ప్లేబుక్ తో పాటు 530కి పైగా ప్రపంచ-ప్రముఖ కార్పొరేషన్‌లు, 35,000 వెటెడ్ స్టార్టప్‌లు ఉన్నాయి. వీటితో పాటు వెంచర్ ఫండింగ్‌లో తొమ్మిది బిలియన్ల అమెరికన్ డాలర్లు సేకరించిన 1,500 యాక్టివ్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా ఈ సంస్థలో భాగంగా ఉన్నాయి . “ప్లగ్ అండ్ ప్లే” సంస్థకు సిలికాన్ వ్యాలీ (అమెరికా), స్టుట్‌గార్ట్ (జర్మనీ), పారిస్ (ఫ్రాన్స్), ఒసాకా (జపాన్), షాంఘై (చైనా), వాలెన్సియా (స్పెయిన్), ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్) తో పాటు ప్రపంచవ్యాప్తంగా 37 కార్యాలయాలున్నాయి.
Google, PayPal, Dropbox, LendingClub, N26, Soundhound, Honey, Kustomer, Guardant Health లాంటి పేరుగాంచిన కంపెనీల తొలి ఇన్వెస్టర్ గా “ప్లగ్ అండ్ ప్లే” ఘనత వహించింది.
2020 సంవత్సరంలో 2,056 స్టార్టప్‌లను వేగవంతం చేసిన ప్లగ్ అండ్ ప్లే కంపెనీ, అదే సంవత్సరంలో 162 వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టింది. ఇది మొబిలిటీ, IoT, ఎనర్జీ, అగ్రిటెక్, హెల్త్, సస్టైనబిలిటీ, ట్రావెల్, ఫిన్‌టెక్ మొదలైన అనేక వర్టికల్స్‌పై దృష్టి పెడుతుంది.
మొదటి సారిగా భారతదేశంలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న “ప్లగ్ అండ్ ప్లే” హైదరాబాద్ లో మొబిలిటీ, IoT, ఎనర్జీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పటిష్టమైన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెడుతుంది. తదుపరి దశ లో ఫిన్‌టెక్ మరియు లైఫ్ సైన్సెస్/ హెల్త్‌కేర్ రంగాలకు విస్తరించనుంది. సీటెల్ లో ఉన్న వెంచర్ ఫౌండ్రీ “ట్రయాంగులమ్ ల్యాబ్స్”, IoT మరియు స్మార్ట్ సిటీల కోసం ఇంక్యుబేషన్‌ను అమలు చేయడానికి హైదరాబాద్‌లోని ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్‌తో కలిసి పనిచేస్తుంది.
ఈ సందర్భంగా జర్మనీ & స్టార్టప్ ఆటోబాన్ ఎండి సస్చా కారింపౌర్ మాట్లాడుతూ, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చూపిన ఉత్సాహాన్ని, చొరవను అభినందించారు. మంత్రి కేటీఆర్ అందించిన ప్రోత్సాహం సహాయంతో ప్లగ్ అండ్ ప్లే భారతదేశంలో అత్యంత విజయవంతమైన కొలాబరేషన్ ప్లాట్‌ఫారమ్ నిర్మిస్తుంది అని ఆయన అన్నారు. రికార్డు సమయంలో నవీన సాంకేతిక సహకారానికి అంతర్జాతీయ కేంద్రంగా మారిన జర్మనీ లోని స్టార్టప్ ఆటోబాన్ లాగా హైదరాబాద్‌లోని ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన “ప్లగ్ అండ్ ప్లే” సంస్థ హైదరాబాద్ లో తమ కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ప్లగ్ అండ్ ప్లే రాక తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు గొప్ప ప్రోత్సాహం అందిస్తుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొబిలిటీ రంగంలో ZF, Fiat Chrysler, Stellantis లాంటి సంస్థల భారీ పెట్టుబడులు తీసుకురావడంలో సఫలీకృతం అయ్యిందని, దీంతో పాటు అనేక OEMలు మరియు టైర్-I సరఫరాదారుల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను రూపొందించే ప్రక్రియలో తెలంగాణ ఉందని మంత్రి తెలిపారు.
మొబిలిటీ రంగం అభివృద్ధికి ఇన్నోవేషన్ చాలా కీలకమైనదని పేర్కొంటూ భారతదేశంలో మొదటి లొకేషన్‌గా హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు ప్లగ్ అండ్ ప్లే సంస్థ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో ప్లగ్ అండ్ ప్లే సెంటర్‌ను మంత్రి శ్రీ కేటీఆర్, ప్లగ్ అండ్ ప్లే వ్యవస్థాపకుడు, సీఈఓ సయీద్ అమీది సమక్షంలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్లగ్ అండ్ ప్లే ఎగ్జిక్యూటివ్‌లు ప్రకటించారు.