తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కాండక్ట్)
ఆదివారం నుండే అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్
ఎలక్టోరల్ ఆఫీసర్) డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. సచివాలయంలో ఆదివారం
సాయంత్రం మీడి యా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టేనని
తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులకు కూడా కోడ్ వర్తిస్తుందని చెప్పారు. ఈరోజు నుండి అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కోసం సీఎం, మంత్రులు
ఉపయోగించుకోవద్దని హెచ్చరించారు. తెలంగాణలోని 17 లోక్‌సభా స్థానాలకు
ఏప్రిల్ 11 న పోలింగ్ జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి 2019 మార్చి 18 న
ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. అదే రోజు నుండి నామినేన్లను
స్వీకరిస్తామని, మార్చి 25 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువుగా
ఉంటుందన్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు
నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. రిటర్నింగ్ అధికారి/అసిస్టెంట్
రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ల పత్రాలను దాఖలు చేసేందుకు
వీలుందన్నారు. మార్చి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా
నిర్ణయించామన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియమావళిని అమలు చేస్తామని రజత్ కుమార్
తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బ్యానర్లు, వాల్‌పోస్టర్లు తదితర ప్రచార
సామాగ్రి ఎక్కడైనా ఉంటే 24 గంటల్లోగా తొలగిస్తామన్నారు. ప్రభుత్వ రంగ
సంస్థల కార్యాలయాల్లో ఉండే బ్యానర్లు, తదితర ప్రచార సామాగ్రిని 48
గంటల్లోగా తొలగిస్తామని, ప్రైవేట్ భవనాలు, ప్రైవేట్ స్థలాల్లో ఉండే
బ్యానర్లు, వాల్‌పోస్టర్లను 72 గంటల్లోగా తొలగిస్తామన్నారు. ప్రభుత్వం
చేపట్టే వివిధ అభివృద్ధి పనుల వివరాలను 72 గంటల్లోగా జిల్లా ఎన్నికల
అధికారులైన, జిల్లా కలెక్టర్లు తమకు అందిస్తారని, ఆన్‌గోయింగ్ పనులు
కొనసాగించవచ్చని, కాని కొత్త పనులను ప్రారంభించేందుకు వీలులేదని స్పష్టం
చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార సామాగ్రిపై
ప్రధాని, ముఖ్యమంత్రులతో సహా మంత్రులు తదితరుల ఫోటోలు వినియోగించవద్దని
తెలిపారు.
పోటీ చేసే అభ్యర్థులు జాతీయ లేదా ప్రాంతీయ పార్టీల తరఫున నామినేషన్ దాఖలు
చేస్తే, నామినేషన్ పత్రంతో పాటు ఆ పార్టీ అందించే అధికారపత్రంతో పాటు ఒక
ఓటరు బలపరిస్తే సరిపోతుందన్నారు. అయితే పోటీ చేసే అభ్యర్థి గుర్తింపులేని
పార్టీ తరఫున లేదా స్వతంత్రంగా పోటీ చేస్తే, 10 మంది ఓటర్లు బలపరుస్తూ
లేఖలు అందించాలన్నారు. నామినేషన్ పత్రం దాఖలు చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చే అభ్యర్థులు కేవలం మూడు వాహనాలను మాత్రమే
ఉపయోగించాలని, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఐదుగురిని మాత్రమే
అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు జనరల్ క్యాటగిరికి చెందిన వారైతే 25 వేల
రూపాయలు డిపాజిట్ చెల్లించాలని, ఎస్‌సీ, ఎస్‌టీ క్యాటగిరీలకు చెందిన వారైతే 12,500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. అభ్యర్థుల ఖర్చు పరిమితి 70
లక్షల వరకు మాత్రమే ఉంటుందన్నారు. ఏప్రిల్ 11 న జరిగే పోలింగ్ సందర్భంగా
34,603 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఓటర్ల సంఖ్య 2.95 కోట్లు
తెలంగాణలో తాజా వివరాల ప్రకారం 2,95,29,271 మంది ఓటర్లు ఉన్నారనని రజత్
కుమార్ తెలిపారు. నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి కొత్త ఓటర్లు తమ పేర్లను
నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఓటర్ల జాబితాతో పాటు సప్లిమెంటరీ
జాబితాలను మార్చి 25 న ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎన్నికలకు
సంబంధించి ప్రజలకు, ఓటర్లకు ఏవైనా అనుమానాలు ఉంటే 1950 కు ఫోన్ చేసి
తెలుసుకోవచ్చన్నారు. ఈ నెంబర్ 24 గంటల పాటు పనిచేస్తుందన్నారు.
పోలింగ్‌కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు మార్చి 12 లోగా సిద్ధంగా
ఉంటాయన్నారు.
విజ్ఞప్తి
భారతప్రజాస్వామ్య విలువలు ఉన్నతమైనవని, ఈ విలువలను కాపాడేందుకు రాజకీయ
పార్టీలు, పార్టీల నాయకులు, ప్రజలు తమకు సహకారం అందించాలని రజత్‌కుమార్
విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగపరమైన, చట్టపరమైన నియమావళి, నియమ, నిబంధనలను
రాజకీయ పార్టీలు, పార్టీల నేతలు పాటించాలని కోరారు. ఎన్నికలు స్వేచ్ఛగా,
స్వతంత్రంగా, శాంతియుతంగా జరిగేలా సహకారం అందించాలని కోరారు. ఓటు వేసేందుకు వచ్చే వారు ఓటర్‌స్లిప్పుతో పాటు ఓటరు గుర్తింపు కార్డు లేదా గుర్తింపు
ఉన్న ఇతర 10 ఐడీ కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకురావలసి ఉంటుందన్నారు.
ఎన్నికల గుర్తుల (సింబల్స్) నుండి ట్రక్ గుర్తును తొలగించామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు యథాతథంగానే జరుగుతాయని రజత్ కుమార్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పరిధి కొద్దిగానే ఉంటుందని, అందువల్ల సాధారణ ఎన్నికలకు
ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తెలిపారు
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more