ఇకపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఏదేని వ్యక్తి లేదా సంస్థకు చెందిన శాశ్వత ఖాతా నెంబరు (పాన్), బ్యాంక్ ఖాతా తదితర వివరాలను నాట్‌గ్రిడ్‌లోని 10 దర్యాప్తు, నిఘా ఏజెన్సీలతో పంచుకోనుంది. ఐటీ శాఖ విఽధివిధానాల రూపకర్త ‘ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు’ (సీబీడీటీ) ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 తేదీన జారీ చేసిన సీబీడీటీ ఉత్తర్వుల ప్రకారం.. పాన్, ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబరు (టాన్), బ్యాంక్ ఖాతాలు, ఐటీ రిటర్ను లు, టీడీఎస్ వివరాలతో పాటు పరస్పర అంగీకారంతో ఏదేని సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ ఈ 10 ఏజెన్సీలతో పంచుకోనుంది. సమాచారం ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ నాట్‌గ్రిడ్ ద్వా రా జరగనుంది. ఐటీ డిపార్ట్‌మెంట్‌లోని నిర్దేశిత అధికారి సమాచారం ఇవ్వబోయే ముందు, ఆ ఏజెన్సీ దర్యాప్తునకు తామిచ్చే వివరాలు ఉపయోగపడతాయా లేదా అన్న విషయంపై స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలని సీబీడీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన తుది విధివిధానాలపై సీబీడీటీ, నాట్‌గ్రిడ్ త్వరలోనే అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనున్నాయి.
పాన్ ఆధారిత సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు నాట్‌గ్రిడ్, ఐటీ డిపార్ట్‌మెంట్ 2017లోనే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. తాజాగా కుదుర్చుకోనున్న ఒప్పందంతో మరింత రియల్‌టైమ్ సమాచారం ఏజెన్సీలకు అందుబాటులోకి రానుంది. దేశంలో ఆయుధ, ఆర్థిక, సైబర్ దాడులను ముందే పసిగట్టి, ఎదుర్కోవడంలో ఈ అదనపు సమాచారం ఏజెన్సీలకు ఎంతగానో దోహదపడనుందని సీనియర్ అధికారి ఒకరన్నారు.
నాట్‌గ్రిడ్ అంటే?
దేశంలో తీవ్రవాద దాడులను ముందుగానే పసిగట్టి, నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్‌గ్రిడ్) పేరుతో అనుసంధానిత నిఘా మాస్టర్ డేటాబే్‌సను ఏర్పాటు చేస్తోంది. ఇమ్మిగ్రేషన్, బ్యాంకింగ్, వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు, విమాన, రైలు ప్రయాణాలు సహా మొత్తం 21 ఆర్గనైజేషన్ల నుంచి సేకరించే రియల్ టైమ్ డేటాను దేశంలోని 10 కీలక దర్యాప్తు, నిఘా ఏజెన్సీలకు అందుబాటులో ఉంచడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. తద్వారా ఈ ఏజెన్సీలకు అనుమానాస్పద తీవ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తులో అవసరమైన డేటాను సత్వరమే నాట్‌గ్రిడ్ నుంచి యాక్సెస్ చేసే వీలుంటుంది. సమాచార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ పది ఏజెన్సీల్లోని నిర్దేశిత అధికారులను మాత్రమే నాట్‌గ్రిడ్ నుంచి డేటా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తారు. 2008లో ముంబై లో జరిగిన తీవ్రవాదుల దాడి తర్వాత అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.3,400 కోట్ల పెట్టుడితో నాట్‌గ్రిడ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
నాట్‌గ్రిడ్‌లోని 10 ఏజెన్సీలు
- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)
- డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)
- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ)
- కేబినెట్ సెక్రటేరియట్
- ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)
- డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎ్‌సటీ ఇంటెలిజెన్స్
- నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)
- ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ)
- నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)