30వ తేదీ గుడ్‌ఫ్రైడే; ఏప్రిల్ ఒకటో తేదీ ఆదివారం సెలవని వివరించారు
బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రానున్నాయి. నెలాఖర్లో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయని, ఈనెల 29, 30, 31, ఏప్రిల్ 1, 2 తేదీల్లో బ్యాంకులు పని చేయవని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం వైరల్‌గా మారింది. 29వ తేదీ మహావీర్ జయంతి; 30 గుడ్‌ఫ్రైడే; 31 ఆర్థిక సంవత్సరం ముగింపు; ఏప్రిల్ 1 ఆదివారం; రెండో తేదీ వార్షిక ముగింపు అని, ఐదు రోజులు వరుస సెలవులు కనక వాటికి తగినట్లుగా ఖాతాదారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. దీంతో, చాలామంది ఖాతాదారులు పెద్దఎత్తున నగదు ఉపసంహరణకు సిద్ధమవుతున్నారు. అయితే, బ్యాంకులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించాయి. రెండు రోజులు మాత్రమే సెలవులు వర్తిస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు.
29వ తేదీ మహావీర్ జయంతి అయినా బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని స్పష్టం చేశారు. 30వ తేదీ గుడ్‌ఫ్రైడే; ఏప్రిల్ ఒకటో తేదీ ఆదివారం సెలవని వివరించారు. వార్షిక ముగింపు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ ఆదివారం వచ్చిందని, ఆరోజు నాన్ బ్యాంకింగ్ వర్కింగ్ డే అవుతుందని, సెలవు అయినా బ్యాంకులు పని చేస్తాయని, నగదు లావాదేవీలు ఉండవని వివరించారు. ఇక, ఏప్రిల్ రెండో తేదీన యథావిధిగా బ్యాంకులు పని చేస్తాయని చెప్పారు.