ప్రగతి భవన్ (తొలిపలుకు న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం ఎఫ్.సీ.ఐ ద్వారా త్వరగా తీసుకోవాలని తద్వారా వానాకాలంలో ఉత్పత్తి అయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందని పేర్కొంటూ, ఇటీవల రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్ లు కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి విన్నవించగా, ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని ఇప్పటికే కేంద్రం వద్ద 5 సంవత్సరాలకు సరిపడా నిల్వలున్నాయని కేంద్ర మంత్రి తేల్చిచెప్పిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుత వానాకాలంలో కూడా 60 లక్షల టన్నులు మించి ధాన్యం తీసుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్మొహమాటంగా చెప్పినందున, ధాన్యాన్ని ప్రభుత్వం గానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని అధికారులు సమావేశంలో తెలిపారు.
దేశంలో కరువులు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ప్రజల అవసరాల దృష్ట్యా ధాన్యం నిల్వ చేయడం కేంద్ర ప్రభుత్వ విధి అని, రాష్ట్రాలు తమకు పంటలను కనీస మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి ఇవ్వడం వరకే రాష్ట్రాల బాధ్యత అని అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, కేంద్రమంత్రి గోయల్ మాత్రం ఇప్పటికే నిల్వలు ఉన్న దృష్ట్యా ఒక్క కిలో ధాన్యం కూడా కొనలేమని చెబుతున్నారని అధికారులు వివరించారు.