సమాజానికి మంగలి కులస్తుల సేవలు ఎనలేనివి
‘‘నూతన సంవత్సర క్యాలెండర్’’ ఆవిష్కరణలో `డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
ఆధునిక సమాజ నిర్మాణంలో ప్రగతి కారకులుగా మంగలి కులస్తుల సేవలు ఎనలేనివని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. నాగరికత రూపకల్పనలో మానవ సమాజానికి వీరి సేవలు అనితర సాధ్యమైనవని ఆయన అన్నారు. క్షురకవృత్తి, ధన్వంతరి ఆయుర్వేద వైద్యం, పురుడుపోయడం, మంగళవాయిద్యాలు మున్నగు మహోన్నత సేవలు ఈ సమాజానికి విశేషంగా అందించిన మంగళ్ళకు ఈ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని ఆయన తెలిపారు.
మంగళవారంనాడు బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పాల్గొని ‘‘క్యాలెండర్’’ ను ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నాగరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డా॥ సూర్యపల్లి సారంగపాణి, ఎస్.రామానంద స్వామి, సూర్యనారాయణ, కె.ఈశ్వర్, బి.ధన్‌రాజ్, ఎమ్.రామచందర్, కె.హరినాథ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రసంగిస్తూ.... నాయిబ్రాహ్మణ సంఘం కొత్త సంవత్సరం క్యాలెండర్‌ను క్రమం తప్పకుండా ప్రచురించి, అందించడం సముచితంగా ఉందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను పొంది అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఎక్కడాలేని విధంగా సెలూన్‌లకు ఇక్కడి ప్రభుత్వం 250యునిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందజేయడం గొప్పవిషయం అని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంఘం తరపున ప్రతినిధులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను, పలు డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించి, పరిష్కారం అయ్యే దిశగా తన వంతు కృషి చేయగలనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.