దశాబ్దాలు సాగుతోన్న అయోధ్య వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రామజన్మభూమి వివాదం పరిష్కారానికి షియా వక్ఫ్ బోర్డ్ కొత్త ప్రతిపాదన చేసింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించింది. అయితే రామమందిరాన్ని అయోధ్యలోనూ, మసీదును లక్నోలోనూ నిర్మించాలని కోరింది.
అన్ని వర్గాలతో చర్చించిన తరువాత ఈ ప్రతిపాదన చేశామని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ వసీద్ రిజ్వీ పేర్కొన్నారు. మరోవైపు ఈ వివాదంపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున పరిష్కారానికి డిసెంబర్ 5న కొందరు మహంతులతో కలిసికోర్టుకు ఈ ప్రతిపాదన గురించి నివేదించనున్నారు. అలాగే మసీదు కోసం లక్నోలో ఎకరం స్థలం కేటాయించాలని కోరనున్నారు.
అఖిల భారతీయ అఖాడ పరిషత్ కూడా అయోధ్యలో మసీదు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కూడా రామజన్మభూమి వివాదం పరిష్కారానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.