సరికొత్త పార్కింగ్ పాలసీ
మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో పార్కింగ్ దోపిడీకి బ్రేక్ వేసేందుకు ప్రభుత్వం సరికొత్త పార్కింగ్ పాలసీని రూపొందించింది. దీన్ని వచ్చే నెల 1వ తేదీ నుంచి నగరంలో పక్కాగా అముల చేసేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పటికే సర్కార్ ఈ పాలసీ అమలుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయటంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బీ.జనార్దన్ రెడ్డి నగరంలోని మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లు, వాణిజ్య సంస్థల యజమాన్యాలతో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లు, వాణిజ్య సంస్థలకు వచ్చే వినియోగదారులు, ప్రజల వాహనాలను తొలి ముప్పై నిమిషాల పాటు ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని కమిషనర్ సూచించారు. అరగంట నుంచి గంట వరకు ఉచితంగా పార్కింగ్ చేసి రసీదు చూపించే వాహనదారుడికి ఆ తర్వాతి పార్కింగ్ కాలానికి నిర్దేశిత పార్కింగ్ చార్జీలను విధించవచ్చునని కమిషనర్ సూచించారు. అరగంట నుంచి గంట వరకు పార్కింగ్ చేసేందుకు ముందుగా రసీదు తీసుకోనివారికి యథావిధిగా నిర్ణయించిన పార్కింగ్ చార్జీలను విధించవచ్చునని తెలిపారు.
పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఖాళీగా ఉన్న ప్రదేశాలను గుర్తించి, వాటిలో తాత్కాలికంగా పార్కింగ్‌ను కల్పించే విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు కూడా కమిషనర్ సూచించారు.