కొత్త హెచ్‌ఐవీ ఔషధాన్ని తీసుకువచ్చిన లారస్ లాబ్స్
దక్షిణాఫ్రికా మార్కెట్లోకి హెచ్‌ఐవీ ఔషధాన్ని విడుదల చేసినట్లు లారస్ లాబ్స్ వెల్లడించింది. మూడు ఔషధాలైన టెనోఫోవిర్ డిసోప్రోక్సిల్ ఫ్యుమరేట్, లామివుడైన్, డోలుటిగ్రేవిర్ (టీఎల్‌డీ) కాంబినేషన్‌తో కొత్త హెచ్‌ఐవీ ఔషధాన్ని తీసుకువచ్చినట్లు తెలిపింది. దక్షిణాఫ్రికా ఫార్మాసుటికల్ కంపెనీ ఆస్పెన్ ఫార్మాకేర్ భాగస్వామ్యంతో గత నెల 26న ఈ ఔషధాన్ని దక్షిణాఫ్రికా మార్కెట్లోకి విడుదల చేసినట్లు లారస్ లాబ్స్ పేర్కొంది. ఈ ఔషధానికి సంబంధించి దక్షిణాఫ్రికా ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ మండలి (ఎస్‌ఏహెచ్‌పీఆర్‌ఏ) నుంచి విశాఖపట్నంలోని లారస్ లాబ్స్ ప్లాంట్, ఆస్పెన్ పోర్ట్ ఎలిజబెత్ ప్లాంట్ గతంలోనే అనుమతులు అందుకున్నాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాలతో పోల్చితే ఈ కొత్త ఔషధం మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందని లారస్ తెలిపింది. 50 ఎంజీ/300 ఎంజీ డోసేజ్‌తో ఈ హెచ్‌ఐవీ ఔషధం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఒప్పందంలో భాగంగా ప్రైవేట్ మార్కెట్ అయిన దక్షిణాఫ్రికా మార్కెట్లోకి ఆస్పెన్‌తో కలిసి ఈ ఔషధాన్ని తీసుకువచ్చినట్లు లారస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఏపీఐ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ ఔషధాన్ని సరఫరా చేయనుందని తెలిపింది.
ఈ ప్లాంట్ ఇప్పటికే అమెరికా ఆహార, ఔషధ నియంత్రణం మండలి (యూఎస్ ఎఫ్‌డీఎ) నుంచి అనుమతిని అందుకుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవీ రోగులకు చికిత్సనందించేందుకు లారస్ ఔషధం కీలకంగా ఉండటం ఎంతో సంతోషాన్నిస్తోందని లారస్ లాబ్స్ ఫౌండర్, సీఈవో సత్యనారాయణ చావా అన్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు స్వాంతన చేకూర్చటంతో ఈ ట్రిపుల్ కాంబినేషన్ ఔషధం చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు సత్యనారాయణ చెప్పారు.