కేంద్రంలో ‘‘బీసీ మంత్రిత్వశాఖ’’ ఏర్పాటు చేయాలి
జనాభాగణనలో ‘‘కులగణన చేపట్టాలి’’ కేంద్రానికి జాతీయ బీసీ సదస్సు డిమాండ్
- జాతీయ బీసీ కమిషన్‌కు వైస్-ఛైర్మన్, సభ్యులను వెంటనే నియమించాలి -దుండ్ర కుమార స్వామి* బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘కేంద్రలో బీసీమంత్రిత్వశాఖ ఏర్పాటు, ‘‘జనాభా గణనలో కులగణన’’, చేపట్టాలనే అంశంపై జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యము లో జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి అధ్యక్షత వహించారు. సమన్వయ కర్తగా బీసీ ఫెడరేషన్‌కులాల సమితి అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం పాల్గొని కీలక ఉపన్యాసం ఇచ్చారు.
బీసీలనుండి ఎదిగివచ్చిన నరేంద్రమోడి ప్రధానమంత్రి అయినప్పుడు, అందరం సంతోషించామని, కాగా ఆయన ఎనిమిదేళ్ళపాలనలో బీసీల ఆశలన్నీ ఆవిరయిపోయాయని అన్నారు. మోడీ తన ప్రస్తుత రెండవ ప్రభుత్వంలో కూడా ఈ వర్గాల ప్రగతికి ఒక పథకం అమలులోకి తేకపోవడం విస్మయాన్ని కల్గిస్తుంది అన్నారు.
బీసీలంతా ముక్తకంఠంతో కేంద్ర వైఖరిని ఎండగడితే 9 నెలల విరామం అనంతరం ఇటీవల జాతీయ బీసీ కమిషన్‌కు ఛైర్మన్ నియమించారన్నారు. వైస్`ఛైర్మన్, సభ్యులను ఇంకా నియమించలేదన్నారు.కమిషన్‌కు ‘రాజ్యాంగబద్ధత’ ఇస్తే ఏమి ప్రయోజనం, ఆ సంస్థను నిర్వీర్యం చేసి ఎవరికి ఉపయోగపడకుండా చేశాక అని ఆయన విమర్శించారు. 40 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు 986 కోట్ల నిధులను కేటాయించి ‘‘సబ్‌కా సాత్’’ అని అనడం హాస్యాస్పదం అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఒక్క చర్య చాలు కేంద్రం బీసీలను ఎంతగా నిరాదరణకు గురిచేస్తున్నదో స్పష్టం అవుతున్నదన్నారు.
కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఉంటే ఒక మంత్రి ఉంటారు. నిధులు, విధులు ఉంటాయి. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉంటాయి. కేంద్రం నిధులతో దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు ఉంటుంది. వెరశి ఈ వర్గాల వికాసానికి ప్రణాళిక బద్ధ చర్యలకు మంత్రిత్వశాఖ ద్వారా కృషి చేసే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దేశంలోని బీసీలను గాలికి వదిలి వేయడమే అని ఆయన అన్నారు. బీసీల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సభకు అధ్యక్షత వహించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ…. బీసీల హక్కుల సాధనకు బీసీల ధర్మపోరాటం మొదలు పెట్టామన్నారు. మోడీ పాలనలో ‘‘బీసీల హక్కులను కాలరాశారన్నారు. ప్రధానమంత్రి బీసీ అయితే ఏమి ప్రయోజనం లేదని, నరేంద్రమోడితన ఎనిమేదళ్ళ పాలన ద్వారా చేతల ద్వారా నిరూపించుకున్నారు అని పేర్కొన్నారు. ‘‘కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ, ఏర్పాటుకు అవసరమైతే మరో స్వాతంత్య్ర సమరం నిర్మిస్తామన్నారు. ఈ సదస్సులో పలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. త్వరలో జాతీయస్థాయి ఉద్యమ నిర్మాణంలో భాగంగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో పర్యటించి అక్కడి బీసీ నాయకులతో సమావేశమై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని కుమారస్వామి తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో న్యూఢల్లీ లోని కాన్సిస్ట్యూషన్ క్లబ్‌లో ఈ డిమాడ్లపై జాతీయ స్థాయి ఓబీసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్లు డుండ్ర కుమారస్వామి తెలిపారు. దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు ప్రసంగిస్తూ…. బీసీల డిమాండ్లు నెరవేరేవరకు ఈ ఉద్యమం ఆగదు అన్నారు. బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ ప్రసంగిస్తూ మోడీపాలనలో జరిగినంత అన్యాయంబీసీలకు మరెన్నడు జరగలేదన్నారు. ఈ సదస్సులో 45 బీసీ కులసంఘాల ప్రతినిధులు, బీసీ విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.