కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
బోనాల పండుగ సందర్భంగా కొండాపూర్ లో శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. దేవస్థాన కమిటీ కార్యవర్గం, యువ నేత శ్రావణ్ గౌడ్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామిని శాలువా,పూల మాలతో సన్మానించారు. దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ కట్ట మైసమ్మ తల్లిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కట్ట మైసమ్మ మహాలక్ష్మి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉందని తెలిపారు. ఇక్కడ వెలసిన అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి అవతారంగా భక్తులు భావిస్తారని తెలిపారు.
ఈ ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని దుండ్ర కుమారస్వామి అన్నారు. 1907 లో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇక్కడ అమ్మవారికి పూజలు చేయడంతో అవి ఆగిపోయాయని నమ్ముతూ ఉంటారు. అప్పటి నుండి ఇప్పటివరకు అటువంటి ఘటనలు జరగలేదంటే తప్పకుండా అమ్మవారి మహిమేనని చెప్పుకొచ్చారు. దేవాదాయ శాఖ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసిందని తెలిపారు. దేవస్థాన కమిటీ కార్యవర్గం బోనాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచిగా ఏర్పాట్లు చేయడం గర్వించదగిన విషయమని అన్నారు. హిందువులంతా ఎంతో ఘనంగా బోనాలు జరుపుకోవాలని కోరారు.
బీసీలకు మంచి చేసేలా ఆ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలని కోరుకున్నానని దుండ్ర కుమారస్వామి తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీలకు ఎలాంటి పథకాలు అమలులో లేవని.. ఇకనైనా వారి బాగుకోసం మంచి పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేలా చూడాలని కోరుకున్నానని అన్నారు. బీసీల అభ్యుదయానికి జాతీయ బీసీ దళ్ పాటు పడుతోందని, బీసీల సమస్యలపై తాము ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, యువ నేత శ్రావణ్ గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్ పాల్గొన్నారు.